Adani stocks: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అనేక వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు (Supreme Court on Adani Group) కీలక ఆదేశం ఇచ్చింది. 


విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కమిటీ విచారణ
హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదికలోని ఆరోపణల కారణంగా ఇటీవలి కాలంలో జరిగిన స్టాక్ క్రాష్‌పై విచారణకు విశ్రాంత న్యాయమూర్తి ఏఎం సప్రే (AM Sapre) నేతృత్వంలో ఒక కమిటీని ‍‌(Committee on Adani Group) ఏర్పాటు చేయాలని, మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కేవీ కామత్ (KV Kamath), నందన్ నీలేకని (Nandan Nilekani) ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. 


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన 'మోసం ఆరోపణల'తో జరిగిన అదానీ గ్రూప్ షేర్ల క్రాష్‌పై రెండు నెలల్లోగా విచారణను ముగించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) సుప్రీంకోర్టు సూచించింది. సెబీ నిబంధనల్లోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే అంశాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.


కొనసాగిన అదానీ స్టాక్స్‌ ర్యాలీ
సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత, అదానీ స్టాక్స్ వరుసగా మూడో రోజైన ఇవాళ (గురువారం, 02 మార్చి 2023) కూడా ర్యాలీని కొనసాగించాయి.


నాలుగు అదానీ స్టాక్‌లు - అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ (Adani Green), అదానీ విల్మార్ (Adani Wilmar), అదానీ పవర్ (Adani Power) 5% జంప్‌ చేసి, అప్పర్ సర్క్యూట్ పరిమితుల్లో లాక్ అయ్యాయి. 
ఈ గ్రూప్‌ లీడర్‌ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) మార్నింగ్‌ సెషన్‌లో 10% పడిపోయినా, ఇప్పుడు తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఈ స్టాక్ గత 2 రోజుల్లో 31% ర్యాలీ చేసింది.


ఈ ఉదయం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్‌లో బ్లాక్ డీల్స్ (భారీ మొత్తంలో షేర్ల క్రయవిక్రయాలు) జరిగాయి. కొనుగోలుదారు, అమ్మకందారు గురించిన వివరాలు ఈ సాయంత్రం మార్కెట్‌ ముగిసిన తర్వాత తెలుస్తాయి.


2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాతి నుంచి, అదానీ గ్రూప్‌ స్టాక్‌ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పైగా తగ్గింది, పెట్టుబడిదార్లు దాదాపు రూ. 12 లక్షల కోట్లు నష్టపోయారు. అదానీ కంపెనీలకు అప్పులు ఇచ్చిన కారణంగా బ్యాంక్ స్టాక్స్‌, LIC కూడా పెట్టుబడిదార్ల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నివేదిక ఒక అంటువ్యాధిలా వ్యాపించి, మొత్తం మార్కెట్‌పైనా ప్రభావాన్ని చూపింది.


గ్రూప్‌ బ్యాలెన్స్ షీట్ & భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై పెట్టుబడిదార్లను ఒప్పించేందుకు, అదానీ గ్రూప్‌ ఆసియా దేశాల్లో మూడు రోజుల రోడ్‌ షో నిర్వహించింది. $690 మిలియన్ల నుంచి $790 మిలియన్ల వరకు విలువైన షేర్-బ్యాక్డ్ లోన్‌లను ఈ సంవత్సరం మార్చి చివరి నాటికల్లా ముందస్తుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.