రెండు రోజుల పాటు జరిగే గ్లోబర్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌  కారణంగా ఆంధ్రాయూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ హెవీగా ఉంటుందన్నారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ పరిసరాల్లో వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల భారీ ట్రాఫిక్ జామ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకాలు సాగించాలని సూచించారు. 


ముఖ్యంగా బీచ్ రోడ్‌లో ట్రాఫిక్ జాం లేకుండా సాఫీ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తామన్నారు శ్రీకాంత్. ఈ రెండు రోజులూ ఎపిఐఐసి గ్రౌండ్స్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలని కోరారు. బుధవారం ప్రకటన విడుదల చేసిన శ్రీకాంత్... నగరంలో ట్రాఫిక్ రద్దీలు లేకుండా చూసేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. 


జీఐఎస్ ప్రతినిధులు, వీఐపీల సందర్శన దృష్ట్యా నగరంలో 2,500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులు, అతిథి గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం, హెలిప్యాడ్‌లు, ప్రతినిధులు, వీఐపీలు బస చేసే హోటళ్ల వద్ద స్నిఫర్‌ డాగ్‌లు, బాంబు స్క్వాడ్‌లు మోహరించారు. పలు చోట్ల పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్‌ తెలిపారు. 


డాగ్‌ స్క్వేడ్‌ను తొలిసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023లో వాడుతున్నారు. ఈ స్నిఫర్ డాగ్ టీమ్‌కి ‘కె9 స్క్వాడ్‌’గా పేరు పెట్టి భద్రతలో భాగం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2023 కోసం భారీగా పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు విశాఖ రానున్న వేళ భద్రత చాలా ముఖ్యం. అందుకే ‘కె9 స్క్వాడ్‌’ను రంగంలోకి దించారు పోలీసులు.  


శునకాలను హ్యాండిల్‌ చేసే హ్యాండ్లర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. 'K9' బృందంలో ప్రస్తుతం లాబ్రడార్, డాబర్ మ్యాన్, జర్మన్ షెపర్డ్ వంటి అత్యున్నతమైన జాతి శునాలు ఉన్నాయి. సిటీలోని  ఏడు ఆడ శునకాలతోపాటు 13 ఈ స్క్వాడ్‌లో ఉన్నాయి. గ్రేసీ, మార్టిన్, రియో, జానీ, రాకీ, యోధా, బ్లాక్కీ, బ్రూటస్, బిట్టు, సీజర్, లక్కీ, రూబీ, జాకీ వాటి పేర్లు. ఇందులో రూబీ మాత్రమే జర్మన్ షెపర్డ్ జాతి చెందింది. జాకీ, సీజర్ డో బెర్మాన్‌ జాతి శునకాలు. మిగిలినవన్నీ లాబ్రడార్లు బ్రీడ్‌కు చెందినవే. వీటితోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా మరో 14 కుక్కలను రప్పించారు పోలీసులు. 


ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ డాగ్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ‘కె9 స్క్వాడ్’లో మూడు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి బాంబ్ డిటెక్షన్ విభాగం, రెండోది ట్రాకర్స్, మూడోది నార్కోటిక్స్. వాసన లేదా స్నిఫ్ చేసే సామర్థ్యం మనిషి కంటే శునకాల్లో 40 రెట్లు మెరుగ్గా ఉంటుంది. అందుకే వీటిని ఈసారి భద్రతలో ప్రధానంగా యూజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతి 20 నిమిషాల తర్వాత ప్రతి శునకానికి ఒక పదినిమిషాల రెస్ట్ ఇస్తారు.