గ్లోబల్‌ ఇన్వెస్టర్ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. దీని కోసం ఈ సాయంత్రమే ఆయన విశాఖ చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు సాగనుందీ సమ్మిట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించిన ప్రభుత్వం.. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో తాము పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికలను వివరించనున్నారు. 


శుక్రవారం జరిగే సదస్సు ఓపెనింగ్‌ సెషన్‌లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కీలక ప్రసంగాలు చేస్తారు. భారత్‌ నుంచి సమ్మిట్‌లో పాల్గొనే పారిశ్రామికవేత్తల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కె.ఎం. బిర్లా, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO, సంజీవ్ బజాజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ హాజరుకానున్నారు.  


ప్రారంభ సెషన్ తర్వాత అన్ని అవసరమైన రంగాలకు సంబంధించిన ప్యానెల్ చర్చలు ఉంటాయి. జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.ఎం. రావు, సెంచరీ ప్లై బోర్డులు చైర్మన్ సజ్జన్ భజంకా, రెన్యూ పవర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ సిన్హా, దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దాల్మియా, పార్లే ఫర్ అడ్వైజర్స్ ఓషన్స్ వ్యవస్థాపకుడు, CEO సిరిల్ గుట్ష్, పెగాసస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు CEO క్రెయిగ్ కోగుట్, టెస్లా ఇంక్, సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO మార్టిన్ ఎబర్‌హార్డ్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్, సెక్రటరీ జనరల్ సత్య త్రిపాఠి,  ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ , అర్జున్ ఒబెరాయ్, ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న అవకాశాలపై చర్చిస్తారు.


శిఖరాగ్ర సదస్సు రెండో రోజు మార్చి 4న వివిధ రంగాల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఇండస్ట్రయలిస్టులు, ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. వ్యాధి నియంత్రణపై భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ సుచిత్రా ఎల్లా మాట్లాడనున్నారు. ఔషధ పరిశోధన, అభివృద్ధిలో విప్లవాల గురించి  డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడతారు. భారతదేశంలోని టెక్, డేటా ఎడ్జ్‌లో ఆంధ్రప్రదేశ్‌ పాత్రపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో చర్చ జరగనుంది. 


సముద్ర వాణిజ్యానికి ఆంధ్ర ఎలా శక్తినివ్వగలదో అనే అంశంపై కేంద్ర పోర్ట్స్ మినిస్టర్‌ సర్బానంద్ సోనోవాల్ చర్చిస్తారు.  GIS 2023కి 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి వ్యాపారాలకు నిజమైన ప్రపంచ వేదికగా మారుతుందని భావిస్తోంది. 


సీఎం జగన్ షెడ్యూల్ ఇదే


02.03.2023 షెడ్యూల్‌
సీఎం వైఎస్ జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస


03.03.2023 షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం రాత్రి బస


04.03.2023 షెడ్యూల్‌
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.