రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..?
మహారాష్ట్రలో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్రం వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికేరాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి భాజపాయే కారణమని శివసేన, కాంగ్రెస్ మండి పడుతున్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వార్తలు రావటం భాజపాపై అనుమానాలు పెంచింది. షిండే శిబిరంలోని 15 మంది ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని తెలుస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF బలగాలు వీరికి భద్రత ఇవ్వనున్నాయి. ఆదిత్య థాక్రేతో సహా సంజయ్ రౌత్ ఇటీవలే షిండేకి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ముంబయికి వచ్చి నేరుగా తలపడాలంటూ ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలోనే కేంద్రం పలువురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచటం చర్చనీయాంశమైంది. జాతీయ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఈ మేరకు ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదంతా భాజపా కుట్రే: శివసేన ఆరోపణ
శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏక్‌నాథ్ షిండేని తొలగించాలన్న డిప్యుటీ స్పీకర్ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేసేందుకు షిండే సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన న్యాయసలహాలు తీసుకుంటున్నారట. పార్టీని వీడిన కారణాలపై వివరణ కోరటం సహజమే అయినా, వివరణ ఇచ్చేందుకు కనీసం వారం రోజులైనా గడువు ఇవ్వాల్సిందని షిండే మద్దతుదారులు అంటున్నారు. నిజానికి ఈ అనిశ్చితికి భాజపానే కారణమన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ, గువాహటిలో రెబల్ ఎమ్మెల్యేలు నివసిస్తున్న హోటల్‌కు వెళ్లటం వల్ల ఈ వాదనలకు బలం చేకూరింది.
Also Read: Prabhas: ప్రభాస్ పార్టీలో అమితాబ్, దుల్కర్ - వైరల్ అవుతోన్న వీడియో