Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం (జూన్ 26) తార స్థాయికి చేరిన టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే హర్షవర్థన్, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో ఆదివారం వారి ఇళ్ల వద్ద భారీ భద్రత, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇద్దరినీ ముందస్తు హౌస్ అరెస్టులు చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే హర్షవర్థన్ తన అనుచర గణంతో ఒక్కసారిగా మాజీ మంత్రి జూపల్లి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు తన అనుచరులతో బయల్దేరిన బీరం హర్షవర్ధన్‌ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం పెంట్లవెల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం, వారి వాహనాన్ని నిలిపివేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.


మరోవైపు జూపల్లి కృష్ణారావు ఇంటి వద్ద పెద్దఎత్తున అభిమానులు, అనుచరులు గుమిగూడారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన జూపల్లి తనపై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి అనవసర ఆరోపణలు చేశారంటూ మరోసారి మండిపడ్డారు. తనను ఎదుర్కొలేనని తెలిసే బీరం హర్షవర్ధన్‌ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టాడని ఎమ్మెల్యే తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని అన్నారు. గతంలో తాను తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించేసినట్లుగా రుజువులు కూడా చూపించారు.


ధైర్యం చాలకే అరెస్టు - జూపల్లి
‘‘నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యేకు సవాల్‌ చేశా. అంబేడ్కర్‌ చౌరస్తా ముందు చాప వేసుకొని కూర్చుంటానని చెప్పా. అందుకు 15 రోజులు టైం కూడా ఇచ్చా. అంబేడ్కర్‌ చౌరస్తాలో సంతకు ఇబ్బంది అవుతుందని.. మీ ఇంటికే వస్తా అని ఆయన ప్రతిసవాలు చేశారు. పొద్దుటి నుంచి ఎదురుచూస్తున్నా.. నా దగ్గరికి వచ్చే ధైర్యం చాలక అరెస్టు చేయించుకున్నారు.


1996లో బ్యాంక్‌ నుంచి రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నా. వడ్డీతో సహా చెల్లిస్తే బ్యాంక్‌ నాకు ఒక ధ్రువపత్రం ఇచ్చింది. ఫ్రుడెన్షియల్‌ బ్యాంక్‌లో రూ.6 కోట్లు రుణం తీసుకున్నా. వడ్డీతో సహా మొత్తం రూ.14 కోట్లు చెల్లించి సెటిల్‌ చేశా. మా ఇద్దరి మధ్య ఉన్న తగాదాతో టీఆర్ఎస్ కు సంబంధం లేదు.’’ అని జూపల్లి కృష్ణారావు మాట్లాడారు.