జీవించే హక్కుని హరించారు: ప్రధాని మోదీ 


మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేశారు. ఆ నాటి చేదు జ్ఞాపకాల గురించి ప్రస్తావించారు. 1975లో జూన్ 15వ తేదీన భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. "జీవించే హక్కుని లాగేసుకున్న రోజులవి" అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. "వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా లాగేసుకున్నారో, అప్పుడు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఓసారి మీ అమ్మ, నాన్నను అడగండి" అని యువతకు సూచించారు. 


ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కోల్పోలేదు..


"దేశ యువతను నేనే ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీ తల్లిదండ్రులు మీ వయసులో ఉండగా, జీవించే హక్కుని కోల్పోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలుసా, 1975లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఇదే జరిగింది" అని అన్నారు మోదీ. ఆ రోజుల్లో ప్రజలందరి హక్కులకూ భంగం కలిగిందని చెప్పారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం అందరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని, ఈ రెండింటినీ ఎమర్జెన్సీ రోజులు హరించాయని వెల్లడించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని గుర్తు చేశారు. వేలాది మందిని అరెస్ట్ చేసినా, లక్షలాది మంది ప్రజలను హింసించినా, ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజలు నమ్మకం కోల్పోలేదని చెప్పారు. 


అంతరిక్ష రంగంలో అపార అవకాశాలు..


ఇదే ప్రసంగంలో భారత్‌లోని అంకుర పరిశ్రమల గురించీ మాట్లాడారు ప్రధాని మోదీ. 2019కి ముంది భారత్‌లో అంతరిక్ష రంగంలో అంకుర 
పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవని, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని స్పష్టం చేశారు. దేశ యువత ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తోందని కితాబునిచ్చారు.  అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో మైలురాళ్లు దాటిందని, ఈ విజయాలే ఇన్‌-స్పేస్‌ అనే కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు తోడ్పాటునిచ్చాయని అన్నారు. 


ఈ ఏజెన్సీ అంతరిక్ష రంగంలో కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్‌లో నీరజ్ చోప్రా గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధింటంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవలే క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మిథాలీ రాజ్‌ను కూడా ఆయన అభినందించారు. సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ పూర్తి చేసిన మాలావత్ పూర్ణకి అభినందనలు తెలిపారు. నెలకోసారి మన్‌కీబాత్‌ రేడియో ప్రసంగం చేస్తారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు ప్రస్తావిస్తారు. సామాజిక సేవ చేస్తున్న వారినీ గుర్తించి వారి గురించి ప్రస్తావిస్తుంటారు. వారి స్ఫూర్తితో అందరూ అదే విధంగా సామాజిక సేవల చేయాలని పిలుపునిస్తుంటారు. ఈసారి ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించి, కాంగ్రెస్‌ మాట ఎత్తకుండానే ఆ పార్టీకి గట్టి చురకలు అంటించారు మోదీ. 


Also Read: Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?


Also Read: Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?