రంగంలోకి దిగిన ఉద్దవ్ థాక్రే సతీమణి..


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. ఉద్దవ్ థాక్రే, షిండేల మధ్య వైరం, దూరం పెరుగుతూనే ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోంది ఆ రాష్ట్రం. థాక్రే సర్కార్ ఎప్పుడైనా కుప్పకూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ థాక్రేతో పాటు సీనియర్ నేత సంజయ్ రౌత్ షిండే శిబిరంపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే కేవలం దూకుడుగానే వ్యవహరించటం కాకుండా కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారు ఉద్దవ్ థాక్రే. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రే కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. శివసేనను కాదనిషిండే శిబిరంలోకి వెళ్లటం సరికాదని, తిరిగి శివసేనలోకి రావాలని తమ భర్తల్ని కన్విన్స్‌ చేసేలా చూడాలని సూచించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


శివసేన పేరు వాడుకోటానికి వీల్లేదు: ఉద్దవ్ థాక్రే 


అటు ఉద్దవ్ థాక్రే కూడా రెబల్ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా సందేశాలు పంపుతున్నారట. శనివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన థాక్రే కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాల్‌థాక్రే పేరుని గానీ, శివసేన పేరుని గానీ ఎవరూ వాడుకోటానికి వీల్లేకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా పోరాడేందుకు సిద్ధమంటూ శివసేన కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. షిండే శిబిరానికి, థాక్రేకు మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు థాక్రే అసిస్టెంట్ రవీంద్ర ఫటక్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన సూరత్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే మధ్యవర్తిత్వం కోసం వెళ్లిన రవీంద్ర ఫటక్‌ కూడా షిండే శిబిరంలో చేరిపోయారు. అటు అసోం ముఖ్యమంత్రి మాత్రం తమ రాష్ట్రంలో శివసేన పార్టీ నేతలు ఉన్నారన్న విషయంలో ఏ స్పష్టతా లేదని, తమ రాష్ట్రంలో పర్యటించేందుకు ఎవరైనా రావచ్చని అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతుగా ఉంటామని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే, భాజపాపై విమర్శలు గుప్పించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రేనంటూమండిపడ్డారు. 


తనను షిండే వర్గ నేతలు కిడ్నాప్ చేశారని, బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారని శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. అయితే షిండే తరపున ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. తమతో నితిన్ దేశ్‌ముఖ్ దిగిన సెల్ఫీలను షేర్ చేస్తూ ఆ వదంతులకు చెక్ పెడుతున్నారు. ప్రస్తుతానికి ఏక్‌నాథ్ షిండేకి మద్దతు పెరుగుతుండటం వల్ల వీలైనంత త్వరగా తమ ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది శివసేన. మరి ఈ ప్రయత్నాలు ఏ మేర విజయవంతం అవుతాయో చూడాలి.