Vishnu Kumar Raju: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును రాజకీయాల్లో అజాత శత్రువు శత్రువు అంటారు. ఎవ్వరినీ నొప్పివ్వకుండా హుందాగా ఉండే వ్యవహారశైలి ఆయనది అని ప్రచారంలో ఉంది. అటు బీజేపీకి వీర విధేయుడు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన నలుగురు ఎమ్మెల్యే లలో విష్ణుకుమార్ రాజు కూడా ఒకరు. వారిలో మాణిక్యాల రావు మృతి చెందగా, ఆకుల సత్యనారాయణ పార్టీ మారారు. కామినేని శ్రీనివాసరావు పూర్తిగా మౌనం పాటిస్తుండగా.. విష్ణుకుమార్ రాజు మాత్రం బీజేపీలో కొనసాగుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా విమర్శలు గుప్పించేవారిలో బీజేపీ నుంచి ఉన్న నేతలు సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు. అది ఉత్తరాంధ్ర అంశాలు కావొచ్చు, రుషికొండ తవ్వకాలు కావొచ్చు. సమస్య ఏదైనా ఏపీ సర్కార్ పై విష్ణుకుమార్ రాజు నుండి విమర్శలు సూటిగానే వస్తూ ఉంటాయి.
ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్..
రాష్ట్రంలోని మరో విపక్షమైన టీడీపీ విషయంలో మాత్రం ఆయనకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అనే ఆరోపణలు విశాఖ రాజకీయాల్లో వినిపిస్తుంటాయి. ఒకప్రక్క టీడీపీ అంటేనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడుతుంటారు. బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ ఇష్యులో అంత సుముఖంగా లేదనీ, టీడీపీ - జనసేనలతో పాటు బీజేపీ పొత్తు అంశం ఆదిలోనే ఆగిపోవడానికీ, పవన్ సైతం జనంతోనే పొత్తు అంటూ కొత్త పల్లవి అందుకోవడానికి బీజేపీ హైకమాండ్ టీడీపీని అంగీకరించక పోవడమే అన్న కథనాలు ఉండనే ఉన్నాయి. దాంతో టీడీపీ అంటే రాష్ట్ర బీజేపీ నేతలు కాస్త అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
విష్ణుకుమార్ రాజు ఈ విషయంలో మాత్రం ప్రత్యేకం :
విష్ణుకుమార్ రాజు మాత్రం ఇటీవల నర్సీపట్నం వెళ్లి మరీ అక్కడ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఆయన అక్రమంగా ఇంటిని నిర్మించారంటూ నర్సీపట్నం మున్సిపల్ అధికారులు ఇంటి గోడను కూల్చివేసిన ఘటనలో వైజాగ్ నుండి వెళ్లి మరీ నర్సిపట్నంలో అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించి రావడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది.
అలాగే, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పుట్టినరోజు వేడుకలకూ హాజరై విష్ణుకుమార్ రాజు సంచలనం సృష్టించారు. ఏకంగా విశాఖపట్నం తూర్పులోని వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయానికి వెళ్లి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఆ వేడుకలకు హాజరైన ఏకైక బీజేపీ నేత విష్ణు కుమార్ రాజే కావడం విశేషం. దీనిపై టీడీపీ వర్గాల్లోనూ కాస్త ఆశ్చర్యంగా ఉన్నారు.
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అప్పటి అధికార టీడీపీతో సన్నిహితంగా మెలిగేవారన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరతారన్న వదంతులు పైతం హల్ చల్ చేశాయి. అయితే ఆయన మాత్రం బీజేపీకే కట్టుబడి ఉన్నారు. ఆ పార్టీకి, హై కమాండ్ కూ తిరుగులేని విధేయుడు విష్ణుకుమార్ రాజు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటారు బీజేపీ నేతలు. కానీ, అదే సమయంలో టీడీపీ అంటే ఏదో మూల ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉందని, అందుకే ఆ పార్టీ నేతలను తరచుగా కలుస్తారని, అవసరమైన సందర్భాలలో వారికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారని బీజేపీతో పాటు టీడీపీలోనూ ఆ మాట వినిపిస్తోంది.