టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పూర్తిగా అప్డేట్ అయిట్లుగా కనిపిస్తున్నారు. ‌ప్రస్తుత రాజకీయలకు అనుగుణంగా తన వ్యవహారశైలి మార్చుకున్నారు. మీరూ, వారు లాంటి సంబోధనలతో వైరి వర్గానికి కూడా గౌరవం ఇచ్చే స్థాయి నుంచి వాడు, వీడు లాంటి కఠిన పదాలను వాడుతూ పార్టీలోని యువ కార్యకర్తలను ఆకట్టుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ విమర్శనా స్థాయిని బట్టి తన భాషను వాడుతూ పార్టీ క్యాడర్ లో జోష్ పెంచుతూ మాస్ ఇమేజ్ తో దూసుకు పోతున్నారు.


2019 ఎలక్షన్స్ ముందు నారాలోకేష్ పరిస్థితి వేరు. ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలక్షన్స్ కు ముందు రాముడు మంచి బాలుడు అన్న చందంగా ఉండేది లోకేష్ ప్రవర్తన. ప్రతి పక్షం అవమానకరంగా మాట్లాడినా, దారుణంగా విమర్శించినా టేకిట్ ఈజీగా తీసుకునేవారు. ఆ మెతక తనం చూచి మరింతగా రెచ్చిపోయేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు. వారు వాడిన భాషలోనే సరైన కౌటర్ ఇవ్వకపోవడంతో మెతకవైఖరి ఆసరాగా తీసుకొని పప్పు అనే నిక్ నేమ్ పెట్టి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించేవారు. ఇలాంటి సందర్భాలలో పార్టీ క్యాడర్ నిరుత్సాహనికి గురైన సందర్బాలు అనేకం. భావితరం టీడీపీ నాయకుడు మరీ ఒక అధికారి మాదిరి ఆచీతూచి మాట్లాడితే పార్టీని ఎలా హోల్డ్ చేస్తారు అన్న అనుమానం సైతం క్యాడర్ వ్యక్తం చేసిందని అంటారు.


ఎప్పుడైతే తన తల్లిని అవమానకరంగా వైసీపీ నాయకులు మాట్లాడారో అప్పటి నుంచి లోకేష్ తన పంథా పూర్తిగా మార్చుకున్నారు. ఎవరికి అర్థమయ్యే భాషలోనే వారికి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తనది కేవలం రామం క్యారెక్టర్ కాదని తనలో ఉన్న రెమోను కూడా బయటకు తీసుకు రావడంతో క్యాడర్ ఒక్కసారిగా సంతోషానికి లోనయ్యారు. మాటకు మాట వారు వాడిన భాషలోనే చెప్పడంతో‌ వైసీపీ నాయకులు కూడా విస్మయానికి లోనయ్యారట. కౌంటర్ ఎటాక్ చేయడంలో లోకేష్ ఆరితేరారని పొలిటికల్ సర్కిల్స్ లో‌ గుసగుసలు వినబడుతున్నాయి. మంచి తనానికి చేతగాని తనానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు అర్థం తెలియదని.. తాను హుందాగా గౌరవంగా రాజకీయాలు చేయడానికి వస్తే అసమర్థుడుగా ముద్రవేసి‌‌ ఆడుకోవాలని అనుకున్నారని ఇక ఆ సోకాల్డ్ నాయకులకు అర్థమయ్యే భాషలోనే కౌటర్ ఇస్తున్నానని సన్నిహితులతో అన్నారట లోకేష్.


రీసెంట్ గా ప్రత్యర్థుల దాడిలో హతమయిన వినుకొండ నియోజకవర్గం రావులపాలేనికి చెందిమ జాలయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్ళారు. ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో అడుగు అడుగునా అఖండ స్వాగతం లభించింది. ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీని అభిమానించే యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పార్టీ వర్గాలలో‌ ఫుల్ జోష్ నింపింది. జాలయ్య కుటుంబాన్ని పరామర్శించేదుకు మద్యాహ్నం మూడు గంటలకు రావులపాలెం చేరుకుంటారని షెడ్యూల్ వేశారు. కాని రాత్రి పది గంటలకు కాని అక్కడికి లోకేష్ చేరుకోలేకపోయారంటే.. పల్నాడు ప్రాంతంలో లోకేష్ కు అడుగు, అడుగునా క్యాడర్ అఖండ స్వాగతం పలికారని పార్టీ నేతలు చెబుతున్నారు.


తర్వాత ప్రెస్ మీట్ లో లోకేష్ వైసీపీని, పోలీస్‌ అధికారులను ఎండగట్టిన తీరు ‌స్థానిక పార్టీ నాయకులలో‌ కొండంత బలాన్ని ఇచ్చింది. సీఎం జగన్ నుంచి లోకల్ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, బోళ్ళ బ్రహ్మనాయుడు వరకు అందరిని ఏక వచనం పరుష పదాలతో ఏకిపారేసిన విధానం క్యాడర్ లో సంతోషాన్ని నింపింది. టీడీపీ నాయకులు, సానుభూతి పరులపట్ల పోలీసుల అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే వారిపై మాటలతో చెలరేగి పోయారు లోకేష్.


లోకేష్ లో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో క్యాడర్ ఖుషీ అవుతోంది. స్థానిక నాయకులు, తమను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ పార్టీ క్యాడర్ కు వెన్నుదన్నుగా నిలబడటంతో పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నాయకుడు ఇచ్చిన మానసిక స్థైర్యంతో ఇక పోలీస్ అక్రమ కేసులకు భయపడబోమని వీధిపోరాటాలకు సైతం సిద్ధం అంటున్నాయి.