సంతకాల్లో ఏదో మతలబు ఉంది: డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్


శివసేన రెబల్ లీడర్‌ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు స్థిరంగా ఉంటారో చూడాల్సి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర డిప్యుటీస్పీకర్ నరహరి జిర్వాల్. షిండే తనకు ఓ లేఖ పంపారని, అందులో 34 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయని చెప్పారు. అయితే ఈ 34 మంది సంతకాలను మరోసారి వెరిఫై చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు జిర్వాల్. ఇందుకు కారణాన్నీ వివరిస్తున్నారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యేలందరూ ఇంగ్లీష్‌లోనే సంతకం చేసినట్టు షిండే చెప్పారట. అయితే ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ సంతకం మాత్రం మరాఠీలో ఉందని చెబుతున్నారు జిర్వాల్. అంటే ఎక్కడో ఏదో మతలబు ఉందని, అదేంటో తేలాలని అంటున్నారు. మిగతా అందరి ఎమ్మెల్యేల సంతకాలనూ మరోసారి చెక్ చేస్తానని స్పష్టం చేశారు. 


చీఫ్ విప్ నియామకం చట్ట ప్రకారమే..


చీఫ్ విప్ నియామకంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరహరి జిర్వాల్. షిండే కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారన్నది స్పష్టత లేదని, ఆ విషయం తేలకుండా విప్ నియామకం ఎలా చేస్తామని అన్నారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. 
చీఫ్ విప్‌ నియమించే సమయంలో ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం తన పార్టీకి కొత్త చీఫ్ విప్‌ని నియమించాలంటూ ఉద్ధవ్ థాక్రే తనను కోరారని, ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నాని స్పష్టంచేశారు జిర్వాల్. షిండేకు మద్దతు తెలపాలంటూ కొందరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలపైనా జిర్వాల్ స్పందించారు."వారిపై ఒత్తిడి తీసుకొచ్చి గువాహటిలోని హోటల్‌లో నిర్బంధించారనటంపై ఎలాంటి ఆధారాల్లేవు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదుల నమోదయ్యాయి. దర్యాప్తు చేపడితే కానీ అందులో నిజానిజాలేంటో బయటపడవు. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలుచుకోలేదు" అని వెల్లడించారు డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్. 


ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలందరూ కలిసి ఏక్‌నాథ్‌ షిండేకి మద్దతు తెలిపే వారిపై ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అమలు చేయాలని డిప్యుటీస్పీకర్‌కు లేఖ రాయొచ్చు. అయితే ఇప్పటికే మూడింట రెండొంతుల మెజార్టీ షిండేకి దక్కటం వల్ల అది సాధ్యపడదు. ఒకవేళ లెటర్ రాసినప్పటికీ ఆధారాలతో సహా ఈ లెటర్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరవాత డిప్యుటీ స్పీకర్ ఈ లేఖను ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు అందిస్తారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇస్తారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో గవర్నర్ కీలకపాత్ర పోషిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గవర్నర్‌ వద్దకు వెళ్లి శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరవచ్చు. అయితే మధ్యంతర ఎన్నికలు జరపాలా వద్దా అన్నది గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.