అమ్మఒడి పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పథకం కోసం నిధుల కొరత ఏర్పడిందని, అందుకే లబ్ధిదారులను ప్రభుత్వం బాగా తగ్గించిందనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. అమ్మ ఒడి పథకం అర్హులైన వారు అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు స్కూలుకు వచ్చే హాజరు ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని బొత్స సత్యనారాయణ వివరించారు. అమ్మ ఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని ఈ పథకానికి విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామని వివరించారు.


విజయనగరంలో అమృత్‌ పథకంలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం రూ.1.96 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.


తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పంపి, హాజరు శాతం పెంచితే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని తెలిపారు. విజయనగరంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ను మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పని చేస్తున్నారని బొత్స వివరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఇంటర్‌లో ఫలితాలు ఏ మాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చారు. స్కూళ్లు, కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 


అవసరమైతే డీఎస్పీ కూడా..
మరోవైపు, బుధవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని చెప్పారు. అవసరమైతే డీఎస్సీ కూడా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. 884 హై స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. 


రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2  జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు  తీసుకుంటున్నామని బొత్స చెప్పారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స పేర్కొన్నారు.