హైదరాబాద్‌ ఉప్పల్‌ లోని చిలుకా నగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ (NIA) అధికారులు సోదాలు చేస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. మెడికల్‌ విద్యార్థిని అయిన రాధ మిస్సింగ్‌ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, విశాఖపట్నానికి చెందిన రాధను శిల్ప.. మావోయిస్టు గ్రూపుల్లో చేర్చారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏక కాలంలో ఎన్ఐఏ అధికారులు మూడు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు.


మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో రాధ కనిపించకుండా పోయింది. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని తల్లి ఆరోపణ చేసింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని వెల్లడించింది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. గత మూడేళ్ల నుంచి రాధ ఇంటికి తిరిగిరాలేదని వాపోయింది.


ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ ఓపెన్ చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది. విశాఖలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. 


హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంటలో తెల్లవారుజాము నుంచి NIA అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో శిల్పను అదుపులోకి తీసుకున్న అధికారులు, మాదాపూర్‌లోని కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి శిల్పను విచారన జరపనున్నారు. అదే విధంగా చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడు శంకర్‌ నివాసంలో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది.