హైదరాబాద్‌లో కలకలం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైదరాబాద్‌లోని జువెనైల్ జస్టిస్ కోర్టు బుధవారం (జూన్ 22) తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు చేసిన వాదనలు చేయగా, కోర్టు వారితో ఏకీభవించింది. దీంతో జువెనైల్ జస్టిస్ బోర్డు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, వారిలో ఒకరు మేజర్ కాగా, మిగిలిన ఐదుగురు మైనర్లే. వీరిలో నలుగురు మైనర్లు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ జువెనైల్ జస్టిస్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జువెనైల్ జస్టిస్ బోర్డు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరారు.
అయితే, నలుగురు మైనర్లు సమాజంలో పలుకుబడి కలిగిన వారి పిల్లలేనని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న సమయంలో వీరికి బెయిల్ ఇస్తే.. బాధితులతో పాటు సాక్షులను కూడా నిందితుల కుటుంబాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జువెనైల్ జస్టిస్ బోర్డు, నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ వారి పిటిషన్లను కొట్టేసింది. ఇదిలా ఉంటే, ఐదో మైనర్ కూడా నేడు (జూన్ 23) జువెనైల్ జస్టిస్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.