Maharashtra Cabinet: 


కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నారా..!


మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడుతూనే వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండు నెలలు దాటినా...ఇప్పటికీ కేబినెట్ విస్తరణ జరగకపోవటం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భాజపా చేతిలో కీలుబొమ్మలైపోయారని మండి పడుతున్నాయి. కేవలం ఈ ఇద్దరు వ్యక్తులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నాయి. అయితే ఈ విమర్శల నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడణవీస్ దిల్లీ పెద్దల్ని కలిసి చకచకా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించారు. కానీ...ఉన్నట్టుండి సీఎం ఏక్‌నాథ్ శిందే అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఫలితంగా..ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అందుకే...డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఈ పనిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దిల్లీ పెద్దల్ని కలిసి మంత్రివర్గ విస్తరణను ఫైనలైజ్ చేయనున్నారు. దీనిపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ NCP ప్రతినిధి స్పందించారు. "ఏక్‌నాథ్ శిందే అనారోగ్యానికి గురైన సమయంలోనే డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఒక్కరే దిల్లీ పెద్దల్ని కలవనున్నారట. మహారాష్ట్రను ఎవరు శాసిస్తున్నారో చెప్పేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది" అని ట్వీట్ చేశారు క్లైడ్ క్రాస్టో. 


ఏబీపీ న్యూస్ సోర్స్ ఆధారంగా చూస్తే...మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. కేబినెట్‌లో ఎక్కువ మంది భాజపా నేతలే ఉంటారనీ సమాచారం. ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. 
1. చంద్రకాంత్ పాటిల్
2.సుధీర్ ముంగన్‌తివార్
3.గిరీశ్ మహాజన్
4.ప్రవీణ్ దరేకర్
5.రాధాకృష్ణ విఖే పటేల్
6.రవి చవాన్
7.బబన్‌రావ్ లోనికర్
8.నితేష్ రాణే 


శిందే క్యాంప్‌ నుంచి కూడా కొందరిని కేబినెట్‌లో చేర్చే అవకాశముంది. 
1. దాదా భూస్
2.ఉదయ్ సామంత్
3.దీపక్ కేసర్కార్
4.శంభూ రాజే దేశాయ్
5.సందీపన్ భూమ్రే
6.సంజయ్ శిర్‌సత్
7.అబ్దుల్ సత్తారీ
8.బచ్చు కదు లేదా రవి రాణా


విస్తరణ జరగకపోయినా మంచి పనులు చేస్తున్నా: సీఎం శిందే


ఇటీవలే సీఎం ఏక్‌నాథ్ శిందే ఓ ప్రెస్‌మీట్‌లో కేబినెట్ విస్తరణ గురించి ప్రస్తావించారు. తమ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తోందని, 
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని స్పష్టం చేశారు. "త్వరలోనే కేబినెట్ విస్తరణ పూర్తి చేస్తాం. ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగకపోయినా, మేం చేయాల్సినవని చేస్తూనే ఉన్నాం. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటున్నాం" అని వెల్లడించారు. జులై 18వ తేదీ అసెంబ్లీ వానాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈలోగా పరిణామాలు మారిపోయి...శిందే ప్రభుత్వం రావటం వల్ల ఇది వాయిదా పడింది. 


Also Read: RBI Monetary Policy : EMIలు కట్టే వాళ్లకు బ్యాడ్ న్యూస్, రెపో రేట్ మళ్లీ పెంచిన ఆర్‌బీఐ


Also Read: Police Overaction: రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ - చలాన్లు పెండింగ్, బైకర్‌పై చేయి చేసుకున్న కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ