Telangana Police Overaction: మాది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉన్నతాధికారులు చాటి చెబుతుంటారు. మరో వైపేమో క్షేత్రస్థాయిలో సీఐలు, ఎస్ఐ, కానిస్టేబుల్స్ మాత్రం సామాన్య ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. వారి కోపాన్ని సామాన్యులపై ప్రదర్శిస్తారు. ఒంటిపైకి యూనిఫాం రాగానే ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు సైతం పెరుగుతున్నాయి. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు చేయి చేసుకున్నాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ బైకర్ ను కొట్టాడు. ప్రస్తుతం కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. 


తనిఖీల్లో వాహనదారుడి చెంప చెల్లు..


కూకట్ పల్లి పరిధిలో ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఉదయం 11 గంటలకు వాహనాలు ఆపి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, పెండింగ్ చలానాలు తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ దుర్భాషలాడుతూ, దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట నుంచి కేపీహెచ్ బీ కాలనీకి వెళ్లే రోడ్డులో కైత్లాపూర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో అదే దారిలో ఏపీ 09 బీవై 3849 నంబర్ గల పల్సర్ బైక్ పై ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపారు. వాహన ధ్రువ పత్రాలు చూపించాలని అడిగారు. 


బైక్ పై 18 పెండింగ్ చలాన్లు..


ఏపీ 09 బీవై 3849 పల్సర్ బైక్ పై 18 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 2012 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆ వాహనంపై 18 పెండింగ్ చలాన్లు ఉండగా.. సుమారు రూ. 7 వేలు చెల్లించాల్సి ఉంది. ఆ పల్సర్ బైక్ కూడా ఓం ప్రకాశ్ రెడ్డి పేరున కాకుండా సనత్ నగర్ కు చెందిన గంగుల సంజయ్ అనే వ్యక్తి పేరు మీదు రిజిస్టర్ అయి ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా బైక్ ను ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. అన్ని పేపర్స్ చూపించాలని, పెండింగ్ చలాన్లు కట్టి వాహనాన్ని తీసుకు వెళ్లాలని సదరు వాహనదారుడికి చెప్పారు. 


వాహనం ఇవ్వాలని అడగడంతో కొట్టిన పోలీసులు..


తన వద్ద బైక్ కు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవని, పెండింగ్ చలాన్లు కట్టేందుకు డబ్బులు కూడా లేవని, వాటిని తర్వాత చెల్లిస్తానని చెప్పాడు ఓం ప్రకాశ్ రెడ్డి. తన వాహనాన్ని ఇవ్వాలని, పని మీద వెళ్తున్నానని పోలీసులను ప్రాధేయపడ్డాడు. సుమారు గంటకు పైగా ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నాడు. కానీ వారు కనికరించలేదు. తనిఖీల్లో భాగంగా మిగతా వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓం ప్రకాశ్ రెడ్డి పదే పదే విసిగిస్తున్నాడని.. కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దుర్భాషలాడుతూ అతడిని అక్కడి నుండి వెళ్లిపోవాలని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అయితే ఈ సంఘటకు సంబంధించిన దృశ్యాలను ఆ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. 


బండి సీజ్..


ధ్రువ పత్రాలు లేవని, పెండింగ్ చలాన్లు కట్టమన్నా కట్టలేదని అందుకే బండిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారమే విధులు నిర్వర్తించామని కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ తెలిపారు.