Maha-K'taka Border Dispute: 


ఎమ్మెల్సీ పాటిల్ డిమాండ్..


మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న సరిహద్దు వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సమస్యపై ప్రత్యేక తీర్మానాలు ప్రవేశపెట్టాయి. దీనిపైనా ఇరు రాష్ట్రాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ఎమ్మెల్సీ జయంత్ పాటిల్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాట్లాడారు. వివాదాస్పద ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఇప్పటికే ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. కర్ణాటకలోని మరాఠీలు ఉన్న 
865 గ్రామాలను పశ్చిమ మహారాష్ట్రలో విలీనం చేస్తూ...దానికి చట్టబద్ధతనిచ్చే తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై సుప్రీం కోర్టునీ ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉంది మహారాష్ట్ర సర్కార్. బెల్‌గాం, కర్వార్ బీదర్, నిపాణి, భల్కీ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో ఉన్న 865 మరాఠీ గ్రామాలనూ మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ వినిపించనున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఇదే విషయాన్ని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఇది జరిగిన వెంటనే ఎమ్మెల్సీ పాటిల్ ఆ వివాదాస్పద ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చాలన్న డిమాండ్ తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. సుప్రీం కోర్టు ఏదో ఓ తీర్పునిచ్చేంత వరకూ ఎలాంటి అలజడులు రేగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ...మహారాష్ట్ర కన్నా ముందే కర్ణాటక ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల వివాదం మరింత ముదిరింది.


సుప్రీం కోర్టులో..


అటు ఉద్ధవ్ ఠాక్రే సేన కూడా ఈ వివాదంపై స్పందించింది. సుప్రీంకోర్టు ఏదోటి తేల్చేంత వరకూ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమే సరైన నిర్ణయమని, కచ్చితంగా ఇది అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. "జమ్ముకశ్మీర్ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించింది. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపైనా ప్రధాని మోడీ దృష్టి సారించి ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి" అని ఎమ్మెల్సీ పాటిల్ అన్నారు. అయితే...దీనిపై లోక్‌సభలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బీజేపీ నేతలు కొందరు అధిష్ఠానాన్ని సంప్రదించే యోచనలో ఉన్నారు. మరోవైపు ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఠాక్రే తప్పుబట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దూకుడుగా వ్యవహరిస్తుంటే మహారాష్ట్ర సీఎం మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. భాష ఆధారంగా రాష్ట్రాలను విభజించిన తర్వాత 1957లో ఈ సమస్య ప్రారంభమైంది. ఇంతకముందు బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమదేనని, ఆ ప్రాంతంలో ఎక్కువ జనాభా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్నారని మహారాష్ట్ర అంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో 800లకు పైగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఉన్నాయని అంటుంది. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967లో మహాజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన సరిహద్దులను కర్ణాటక కొనసాగిస్తుంది. 


Also Read: PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు!