Hyderabad Crime News: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో మోది హత్య చేశారు. అతని ఇంటికే వెళ్లి అక్కడే చంపడం సంచలనంగా మారింది. అయితే ఘటనాస్థలంలో మతిస్థిమితం లేని మృతుడి సోదరి కూడా ఉన్నారు.
అసలేం జరిగిందంటే..?
చాంద్రాయణగుట్ట ఇన్ప్సెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన మొహమ్మద్ కలీం ఖాన్ (40) కు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఒక సోదరుడు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటుండగా మరో ఇద్దరు సోదరులు రక్షాపురంలో ఉంటున్నారు. కలీంఖాన్కు, అతని సోదరికి మతిస్థిమితం అంతంత మాత్రమే ఉండడంతో ఇద్దరు ఒకే దగ్గర పాతబడిన ఇంట్లో నివాసం ఉంటున్నారు. గంజాయికి అలవాటు పడ్డ కలీంఖాన్ ఎలాంటి పనులు చేసేవాడు కాదు. మంగళవారం తెల్లవారు జామున సమయంలో కలీంఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టి హత్య చేశారు. సాయంత్రం సమయంలో స్థానికుల ద్వారా సమచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తన బృందంతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
"చాంద్రాయణగుట్ట పరిధిలోని 40 ఏళ్ల వయసు ఉన్న కలీం ఖాన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని సమాచారం ఇచ్చారు. ఈరోజు ఉదయం హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. దీని విషయంలో కేసు నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్నాం. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందువల్ల జరిగింది వంటివన్నీ కూడా పరిశోధన చేసిన తర్వాతే చెప్తాం. మాకు సమాచారం వచ్చింది కూడా సాయంత్రమే. క్లూస్ టీం వస్తది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరిపిస్తాం." - ప్రసాద్ వర్మ, చాంద్రాయణగుట్ట ఇన్ స్పెక్టర్
అతని ఇంట్లోనే రాయితో తలపై మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కలీంఖాన్ ను ఎవరు, ఎందుకు హత్య చేశారు వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. గంజాయ్ బ్యాచే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు వందల కోసం గొడవ - లారీ కింద తోసేసి హత్య
క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ఎక్కువ మాట్లాడుతుందని సవతి తండ్రి కూతురుని హత్య చేసిన ఘటన ఇటీవల జరిగింది. హైదరాబాద్ లో మరో ఘటన వెలుగుచూసింది. నాలుగు వందల కోసం హత్య చేశాడో వ్యక్తి. హైదరాబాద్ బాలానగర్ లో ఆ దారుణ హత్య జరిగింది. కూలీలుగా పని చేసే కాశీరాం, శ్రీనివాస్‌ల మధ్య డబ్బుల కోసం గొడవ జరిగింది. నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై వీళిద్దరూ గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై కాశీరాం, శ్రీనివాస్‌ను కర్రతో బలంగా కొట్టి, అటువైపు వెళ్తోన్న లారీ కిందకు తోసేశాడు. లారీ కిందపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు.