తెలంగాణ సిరులగని సింగరేణి ఇప్పుడు పర్యటకులకు సరికొత్త అనుభవాలను అందించనుంది. గనులు, అందులో పనిచేసే కార్మికులు యంత్రాల పని విధానాలపై వినడమే కానీ ఎప్పుడు నేరుగా చూసే అవకాశం ప్రజలకు దక్కదు. ఇకపై అలాంటి ఇబ్బంది లేదు. సింగరేణి గనుల ప్రత్యక్ష అనుభవాన్ని అందించడానికి కొత్తగా "కోల్ టూరిజం" పేరుతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి బస్సు సర్వీసు కూడా నేడు (డిసెంబరు 28) ప్రారంభం అయింది.


తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో కోల్ టూరిజం, సింగరేణి దర్శన్ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఖుస్రోషాఖాన్  తెలిపారు. ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా సింగరేణి దర్శనం బస్సును ప్రారంభించారు. 28వ తేదీన బుధవారం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి కరీంనగర్ బస్ స్టేషన్‌కు ఉదయం 9 గంటలకు బస్సు చేరుకుంటుందని తెలిపారు. సింగరేణి పర్యటన ముగిసిన తర్వాత సికింద్రాబాద్ కు అదే రోజు రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుందన్నారు. 


28వ తేదీ తర్వాత జనవరి 7వ తేదీ శనివారం నుంచి ఈ ప్యాకేజీ సర్వీసు ప్రతి శనివారం నడుస్తుందని అన్నారు. సింగరేణి దర్శన్ లో భాగంగా ప్రాణహిత, గోదావరి లోయ పరిసర ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పిస్తుంది అన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతంలో 350 కిలోమీటర్ల వరకు సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయని చెప్పారు. ప్యాకేజీలో అండర్ గ్రౌండ్ మైన్ వ్యూ, ఓపెన్ కాస్ట్ గనులు, జైపూర్ పవర్ ప్లాంట్, రెస్క్యూ స్టేషన్లను ప్రయాణికులు చూడవచ్చని తెలిపారు. టికెట్ ధర సికింద్రాబాద్ నుంచి 1,850 రూపాయలు కరీంనగర్ నుంచి రూ.1,050 రూపాయలు అని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్‌పై రూ.250 తగ్గించి సికింద్రాబాద్ నుంచి రూ.1,600 రూపాయలు, కరీంనగర్ నుంచి రూ.800 రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు.


బుక్ చేసుకోవడం ఎలా?


ఆర్టీసీ ఆన్ లైన్ అధికారిక వెబ్ సైట్లో టూరిజం సెక్షన్ లో సింగరేణి దర్శన్ లో ఓపీఆర్ఎస్ సర్వీస్ నెంబర్ 88888లో టికెట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని అన్నారు. అన్ని బస్ స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లు ఏటీబీ ఏజెంట్ల వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సింగరేణి దర్శన్ ప్యాకేజీలో గ్రౌండ్ మైన్ వద్ద టీ, స్నాక్స్, మధ్యాహ్నం శాకాహార భోజనం సౌకర్యం ఉంటుందని అన్నారు. ఉదయం, టిఫిన్ రాత్రి భోజనం గుర్తించిన హోటల్ వద్ద ఖర్చులు ప్రయాణికులే భరించాలని తెలిపారు. భద్రత పరంగా అన్ని రకాల చర్యలను సంస్థ తీసుకుంటుందని అధికారులు తెలిపారు.


ఇప్పటి వరకు రకరకాల టూరిజం ప్యాకేజీలను చూసిన ప్రజలకు ఈ కోల్ టూరిజం కొత్త తరహా అనుభవాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనికి మరింత ప్రచారం తోడైతే విజయవంతమై మరిన్ని నూతన ఆలోచనలకు పునాది పడుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు పిలుపునిచ్చారు.