తెలుగు చిత్రసీమలో వారసులు కథానాయకులుగా రావడం కొత్త ఏమీ కాదు. స్టార్ హీరోల కుమారులు హీరోలుగా రావాలని అభిమానులు కోరుకుంటారు. ఆ మధ్య ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన కుమారుడు మహాధన్ (Raviteja Son Mahadhan) ను హీరోగా పరిచయం చేయనున్నారని వినిపించింది.
'ఇడియట్ 2'తో మహాధన్ ఎంట్రీ!?
రవితేజ చేసిన సినిమాల్లో 'ఇడియట్' సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆ సినిమాను తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమాకు సీక్వెల్ 'ఇడియట్ 2'తో మహాధన్ హీరోగా పరిచయం కానున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై రవితేజ స్పందించారు.
'వాల్తేరు వీరయ్య'లో రవితేజ నటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశానికి ఆయన కూడా వచ్చారు. ఆయన్ను ''మీ అబ్బాయిని 'ఇడియట్ 2' సినిమాతో లాంచ్ చేస్తున్నారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు ఏమంటారు?'' అని అడిగ్గా... ''అటువంటిది ఏమీ లేదండీ! ఇది నాకు చాలా కొత్తగా ఉంది'' అని సమాధానం ఇచ్చారు. ''రవి గారి అబ్బాయి చాలా చిన్నోడు'' అని నిర్మాత వై. రవి శంకర్ చెప్పారు. అదీ సంగతి!
'రాజా ది గ్రేట్'లో నటించిన మహాధన్
హీరోగా మహాధన్ పరిచయం కావడానికి సమయం ఉందేమో! అయితే, నటుడిగా అబ్బాయి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో అతడు నటించాడు. ఆ తర్వాత మళ్ళీ నటించలేదు. రవితేజకు కుమారుడిని మళ్ళీ సినిమాల్లో ఎప్పుడు చూపిస్తారని ప్రశ్న ఎదురవుతూ ఉంది. అబ్బాయి చదువుకుంటున్నాడని, ప్రస్తుతానికి పరిచయం చేసే ఆలోచన ఏదీ లేదని చెబుతూ వస్తున్నారు.
'ధమాకా' విజయంతో హ్యాపీ
మాస్ మహారాజా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది 'ధమాకా' మంచి హ్యాపీ మూమెంట్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. దీని కంటే ముందు 2022లో వచ్చిన రవితేజ రెండు సినిమాలు ఆశించిన బాక్సాఫీస్ విజయాలను ఇవ్వలేదు. దాంతో అందరి చూపు 'ధమాకా' మీద పడింది. ఇటు అభిమానులకు కావాల్సిన అంశాలు ఉండటంతో పాటు కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది. క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకుంటూ భారీ వసూళ్ళు సాధిస్తోంది.
Also Read : చిరు, బాలయ్య పోటీ - నో ప్రాబ్లమ్, ఆల్ హ్యాపీస్!
సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ... ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమా చేస్తున్నారు రవితేజ. అది కాకుండా 'ధమాకా' సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'ఈగల్' టైటిల్ ఖరారు చేసినట్లు టాక్. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఉంది. అది పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
ధమాకా @ 40 క్రోర్స్ ప్లస్!
Dhamaka Box Office Collection Day 5 : థియేటర్ల నుంచి 'ధమాకా' తొలి రోజు పది కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. మొదటి రోజు, రెండో రోజు కంటే మూడో రోజు థియేటర్లలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. కానీ, 'ధమాకా' అలా కాదు... నాలుగో రోజు కూడా దుమ్ము లేపింది. మొదటి మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'ధమాకా'... నాలుగో రోజు 42 ప్లస్ కోర్స్ కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. అంటే... నాలుగో రోజు తొమ్మిది కోట్లు వచ్చాయి అన్నమాట. ఐదో రోజు కూడా మంచి వసూళ్లు సాధించినట్టు తెలిసింది.