తెలుగులో అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి పండక్కి వస్తున్నాయి. అదీ ఒక్క రోజు వ్యవధిలో. రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ పండక్కి మరో నాలుగు సినిమాలు రానున్నాయి. అందులో రెండు పెద్ద సినిమాలు విజయ్ 'వారసుడు', అజిత్ 'తెగింపు' ఉన్నాయి. అవి తమిళ డబ్బింగ్ ఫిల్మ్స్. మరో రెండు చిన్న సినిమాలు రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన 'విద్యా వాసుల అహం', సంతోష్ శోభన్ 'కళ్యాణం కమనీయం' కూడా ఉన్నాయి. 


అసలు పోటీ చిరు, బాలయ్య మధ్యే!
సంక్రాంతి సినిమాల్లో అసలు పోటీ చిరంజీవి, బాలకృష్ణ మధ్యే నెలకొంది. రెండు సినిమాల నుంచి పాటలు రావడం ఆలస్యం... ఎవరి పాట బావుంది? ఏ సినిమాకు ఎక్కువ ప్రమోషన్ ఉంది? వంటి డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే... ఎవరి సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తాయి? ఏ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ ఇంపార్టెన్స్ ఇస్తుంది? వంటిది మరో సమస్య.


అటు అభిమానులను సంతృప్తి పరుస్తూ... ఇటు ఇండస్ట్రీలో వ్యాపార పరంగా తమ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల సుమారు 15 కోట్లు అదనంగా వచ్చే ఆదాయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కోల్పోవలసి వస్తుందని ఒక అంచనా. అది పక్కన పెడితే... ఇద్దరు హీరోల నుంచి వాళ్ళకు ఒత్తిడి ఏమైనా ఉందా? మంగళవారం నిర్వహించిన 'వాల్తేరు వీరయ్య' విలేకరుల సమావేశంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. 


రెండిటికి గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటాయి!
సంక్రాంతికి మీ సినిమాతో పాటు బాలకృష్ణ సినిమా వస్తుందని చిరంజీవిని ఓ విలేకరి ప్రశ్నించగా... రవి శంకర్ స్పందించారు. ''ఈ ప్రశ్నకు సమాధానం మేము చెప్పాలి. మాకు చిరంజీవి గారు ఎన్నోసార్లు చెప్పారు.... 'రవి! రెండు సినిమాలు బావుండాలి. రెండు సినిమాలు ఆడాలి' అని! అందులో ఎటువంటి అనుమానం లేదు. చిరంజీవి గారు ఆశావాది. మాకు బాలకృష్ణ గారి సినిమా నుంచి కూడా ఇటువంటి మద్దతు ఉంది. మేం హ్యాపీగా ఉన్నాం. అన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మేం హ్యాపీ. రెండూ గ్రాండ్ ఓపెనింగ్ తో ఉంటాయి'' అని చెప్పారు. 


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?


థియేటర్స్ సమస్య ఉండదు!
విజయ్ 'వారసుడు' కూడా సంక్రాంతి బరిలో ఉంది. తెలుగులో అగ్ర నిర్మాతలలో ఒకరైన 'దిల్' రాజు నిర్మించిన చిత్రమది. దానికి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని, చిరు బాలయ్య సినిమాలకు తక్కువ థియేటర్లు వస్తున్నారని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సహా కొందరు నిర్మాతలు కామెంట్స్ చేశారు. ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు వస్తే ఎక్కువ థియేటర్లు ఎలా వస్తాయని 'దిల్' రాజు కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే... 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా అడుగు పెడుతోంది. ఎవరి సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తారు? అని అడిగితే...


''రెండు సినిమాల విడుదలకు ఇంకా 15 రోజుల సమయం ఉంది. థియేటర్ల పరంగా సమస్యలు ఏమీ లేవు. ఏ సినిమా స్టామినాకి ఎన్ని థియేటర్లు కావాలో అన్ని జరుగుతాయి. ఏవైనా ఒకటి ఆరా ఉంటే డిస్కషన్ ద్వారా సాల్వ్ అవుతుంది. నథింగ్ టు వర్రీ'' అని రవి శంకర్ చెప్పారు. అదీ సంగతి! సో... ప్రొడ్యూసర్స్ ఆల్ హ్యాపీస్ అన్నమాట. 


Also Read : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?