తెలుగు ప్రేక్షకుల్లో నందమూరి కుటుంబానికి వీరాభిమానులు ఉన్నారు. అదే విధంగా మెగా ఫ్యామిలీకి కూడా! ఏ కుటుంబంలోనూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ కుటుంబం నుంచి సుమారు పది మంది హీరోలు వచ్చారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వారసులుగా వచ్చిన మూడో తరం హీరోలు కూడా స్టార్లుగా వెలుగొందుతున్నారు. నాలుగో తరం కూడా బాల నటులుగా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 


నందమూరి, మెగా అభిమానులకు పడదు. తమ హీరోలు గొప్ప అంటే తమ హీరోలు గొప్ప అంటూ అప్పుడప్పుడు గొడవలు పడుతుంటారు. ఒకప్పుడు థియేటర్ల దగ్గర కటౌట్స్ పెట్టడంలో పోటీ పడేవారు. తమ హీరో గొప్ప అని, తమ హీరో సినిమా ఎక్కువ రోజులు, ఎక్కువ సెంటర్లలో ఆడిందని చెప్పుకోవడం కోసం డబ్బులు కట్టి మరీ థియేటర్లలో సినిమాలు ఆడించేవారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండ్స్ విషయంలో కూడా ఆ పోటీ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో అది హద్దులు మీరి, కొందరు వల్గర్ కామెంట్స్ చేసే వరకు వెళుతోంది.


ఎన్టీఆర్, చరణ్ స్నేహితులే!
గతం పక్కన పెడితే... ఇప్పుడు నందమూరి, మెగా హీరోలు తరచూ కలుస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళిద్దరి స్నేహం గురించి ప్రేక్షక లోకానికి తెలిసింది. కానీ, అభిమానులు మాత్రం అలా స్నేహపూర్వకంగా ఉండటం లేదు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత రామ్ చరణ్ బాగా చేశాడని మెగా ఫ్యాన్స్... లేదు లేదు ఎన్టీఆర్ బాగా చేశాడని, ఆయనకు ఎక్కువ పేరొచ్చిందని నందమూరి అభిమానులు పోటా పోటీగా ట్విట్టర్ ట్రెండ్స్ వార్‌లో పార్టిసిపేట్ చేశారు.
 
ఇప్పుడు 'నాటు నాటు...' సాంగ్ ఆస్కార్స్ షార్ట్ లిస్టు చేసిన పదిహేను పాటల్లో చోటు దక్కించుకుంది కదా! ఒక్కసారి ట్విట్టర్‌కి వెళ్లి చూడండి... ఈ ఘనత సాధించిన తరుణంలో హీరోలు సంతోషం వ్యక్తం చేస్తే, అభిమానులు గొడవలు పడుతున్నారు. 'నాటు నాటు'లో తమ హీరో బాగా చేశాడంటే, తమ హీరో బాగా డ్యాన్స్ చేశాడని ట్రోల్స్ చేస్తున్నారు.
 
రాజకీయాల్లోనూ సరైన సఖ్యత లేదుగా!
'నాటు నాటు...' పాటను ముందు పెట్టి నందమూరి, మెగా అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు, గొడవలు పడుతుంటే... అదే సమయంలో నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతోన్న 'వీర సింహా రెడ్డి' సినిమా సెట్స్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. సాంగ్ షూటింగ్ చూశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.


Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!


బాలకృష్ణ, పవన్ కలిసినా... ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మాంచి జోరుగా సాగుతోంది. వీళ్ళిద్దరూ హీరోలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైన వ్యక్తులు కూడా! తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన, వియ్యంకుడు అండ్ బావ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నడుస్తున్న తెలుగు దేశం పార్టీ నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయనున్నారు. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఒకసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. మళ్ళీ తెలుగు దేశంతో జత కట్టవచ్చని రాజకీయ వర్గాల సమాచారం. అది నిజమా? కదా? అనేది పక్కన పెడితే... సినిమా అభిమానులతో ఇరు పార్టీల కార్యకర్తల్లో కొందరి మధ్య సఖ్యత లేదు. పోటీలు, గొడవలు పడుతున్నారు. త్వరలో 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ కళ్యాణ్ రానున్నారని సమాచారం. అందులో ఈ గొడవల గురించి బాలకృష్ణ ప్రశ్నలు వేస్తారేమో!? చూడాలి. 


చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న 'ఆహా' కోసం బాలకృష్ణ టాక్ షో చేస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చారు. అల్లు అర్జున్ ఆర్మీ, నందమూరి అభిమానుల మధ్య కూడా సోషల్ మీడియాలో వార్స్ జరుగుతుంటాయి. నందమూరి, మెగా హీరోలు కలుస్తున్నారు. మరి, ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? సోషల్ మీడియాలో, బయట ఈ గొడవలకు ముగింపు పలికేది ఎప్పుడు? వెయిట్ అండ్ వాచ్!


Also Read : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర