Tollywood 2022 Review : ప్రతి ఒక్కరూ హిట్ సినిమా తీయాలని పని చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆశించిన రిజల్ట్ రాకపోవచ్చు. అలాగని, ఎవరి ప్రతిభనూ తక్కువ అంచనా వేయలేం! ఫ్లాప్ అవ్వడానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. ఏ ఒక్కరినో పరాజయానికి బాధ్యులు చేయలేం. అయితే, 2022లో వచ్చిన కొన్ని డిజాస్టర్ సినిమాలకు కారణం దర్శకులు అనే ప్రచారం ఎక్కువ జరిగింది.


ఫ్లాప్ సినిమాలు ప్రతి ఒక్కరి కెరీర్‌లో, ప్రతి దర్శకుడి ఫిల్మోగ్రఫీలో ఉంటాయి. ఏ  రాజమౌళికో తప్ప హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ ఎవరికీ లేదు. కొన్నిసార్లు ఫ్లాప్స్ అయినా దర్శకులకు విమర్శలు, కొంత మంది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అయితే, ఈ ఏడాది వచ్చిన కొన్ని ఫ్లాప్స్ స్టార్ దర్శకుల ఇమేజ్‌ను దారుణంగా డ్యామేజ్ చేశాయి. ఆ సినిమాలేంటి? ఆ దర్శకులు ఎవరు? ఓ లుక్ వేయండి.


కొరటాలకు ఎంత కష్టం వచ్చింది!?
'ఆచార్య' రిజల్ట్ అందరికీ తెలిసిందే. అయితే, సినిమా విడుదలైన తర్వాత అందరి కంటే ఎక్కువగా ఆ పరాజయం తాలూకూ విమర్శల బాణాలను ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి కొరటాల శివ (Koratala Siva). ముందుగా మెగా అభిమానులు ఆయనను టార్గెట్ చేశారు. తొలి ఆట నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. చిరంజీవి, రామ్ చరణ్‌తో సరైన సినిమా తీయలేకపోయారని విమర్శించారు. పరాజయానికి కొరటాలను బాధ్యుడిని చేశారు. 


అభిమానుల సంగతి పక్కన పెడితే... చిరంజీవి సైతం ఓ కార్యక్రమంలో పరోక్షంగా కొరటాల మీద విమర్శలు చేశారు. కొంత మంది దర్శకులు సెట్‌కు వచ్చి స్క్రిప్ట్ రాస్తారని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాతో 'ఆర్ఆర్ఆర్' తర్వాత తానొక సినిమా చేశానని, అదేమంత పెద్ద విజయం సాధించలేదని రామ్ చరణ్ కామెంట్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ అయితే చిరంజీవి సినిమాకు ఎటువంటి నేపథ్య సంగీతం అందించాలో తనకు తెలుసునని, తాను చిరంజీవి సినిమాలకు పని చేస్తూ సంగీత దర్శకుడిగా ఎదిగానని, కానీ తాను చేసిన నేపథ్య సంగీతం బాలేదని దర్శకుడు మరో విధంగా చేయించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఆచార్య' నేపథ్య సంగీతం బాలేకపోవడానికి కొరటాల శివ కారణమని చెప్పారు.


'మిర్చి' నుంచి 'భరత్ అనే నేను' వరకు కొరటాల శివకు వచ్చిన ఇమేజ్‌పై ఒక్క 'ఆచార్య' పరాజయం చాలా ప్రభావం చూపించింది. ఈ ఏడాది డిజాస్టర్ కారణంగా ఎక్కువ ఎఫెక్ట్ అయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే... అది కొరటాల శివ అని చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాతో హిట్ అందుకోవాల్సిన అవసరం ఆయనకు ఏర్పడింది.


పూరికి ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు!
పూరి జగన్నాథ్‌కు హిట్టూ ఫ్లాపులు కొత్త కాదు. కింద పడిన ప్రతిసారీ గోడకు కొట్టిన బంతిలా ఆయన రెట్టింపు వేగంతో, బలంగా పైకి వచ్చారు. ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ హిట్స్ తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే... 'లైగర్' డిజాస్టర్ ఆయనకు కొత్త చిక్కులు తెచ్చింది. గొడవ పోలీస్ స్టేషన్ మెట్లకు ఎక్కింది. డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ ఫైనాన్షియర్లతో ఆయనకు మాట మాట వచ్చింది. పరువు పోతుందని డబ్బులు వెనక్కి ఇవ్వడానికి రెడీ అయ్యాననే మాట పూరి (Puri Jagannadh) నోటి నుంచి వచ్చిందంటే... పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈడీ విచారణ వంటి విషయాలు పక్కన పెడితే... 'లైగర్' విడుదలకు ముందు ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండతో సెట్స్ మీదకు తీసుకు వెళ్లిన 'జన గణ మణ' సినిమా ఆగడం పెద్ద దెబ్బ. 'లైగర్' డిజాస్టర్ కావడంతో ఆ సినిమా చేయకూడదని విజయ్ దేవరకొండ నిర్ణయం తీసుకున్నారు. పూరి కెరీర్‌లో ఫ్లాప్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ తర్వాత ఆయనపై నమ్మకంతో సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు. కానీ, ఎప్పుడూ ఇలా జరగలేదు. 


'రాధే శ్యామ్'తో రాధాకృష్ణపై విమర్శలు
'బాహుబలి', అంతకు ముందు సినిమాలతో తనకు వచ్చిన యాక్షన్ ఇమేజ్ పక్కన పెట్టి మరీ ప్రేమకథ 'రాధే శ్యామ్' చేశారు ప్రభాస్. ఆయన వీరాభిమానులకు కూడా సినిమా సరిగా నచ్చలేదు. కథ, కథనం పక్కన పెడితే... రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) తీసిన విధానంపై విమర్శలు గుప్పించారు. గ్రాఫిక్స్ బాలేదన్నారు. దర్శకుడి టేకింగ్ మీద ట్రోల్స్ చేశారు. 'రాధే శ్యామ్' కంటే ముందు రాధాకృష్ణ తీసింది ఒక్క సినిమాయే. అదీ 'జిల్'. అయితే, అందులో గోపిచంద్‌ను స్టైలిష్‌గా చూపించారని పేరు తెచ్చుకున్నారు. 'రాధే శ్యామ్'తో ఆయన ఫీట్ రిపీట్ చేయలేకపోయారు. 


విక్రమ్ కుమార్ టచ్ ఏమైంది?
తెలుగు ప్రేక్షకుల్లో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'ఇష్క్', 'మనం'తో పాటు తమిళ అనువాదాలు '24'తో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమా 'థాంక్యూ'. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించారు. ఈ సినిమా చూశాక... చాలా మందికి వచ్చిన సందేహం ఒక్కటే! నిజంగా, విక్రమ్ కుమార్ తీశారా? లేదా? అని! ఆయన టచ్ ఏమైంది? అనే మాటలు వినిపించాయి.


Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?


'జాతి రత్నాలు'తో విజయం అందుకున్న అనుదీప్ కేవీ... ఈ ఏడాది రచయితగా 'ఫస్ట్ డే ఫస్ట్ షో', దర్శకుడిగా 'ప్రిన్స్' సినిమాలతో విమర్శల పాలయ్యారు. 'మత్తు వదలరా' వంటి సినిమా తీసిన రితేష్ రాణా... 'హ్యాపీ బర్త్ డే'తో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఎస్ఆర్ శేఖర్ రొటీన్ కథతో సినిమా తీశారనే విమర్శల్ని మూట కట్టుకున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నగేష్ కుకునూర్ నుంచి 'గుడ్ లక్ సఖి' లాంటి సినిమా ఆశించలేదని ప్రేక్షకులు చెప్పారు.
 
సినిమాలు డిజాస్టర్లు కావడం ఒక్కటి అయితే... దర్శకులు సరిగా దృష్టి పెట్టకుండా తీయడం వల్ల పరాజయాలు వచ్చాయనే విమర్శలు ఎక్కువ హైలైట్ అయ్యాయి. ఫ్లాపులకు ఎవరు కారణమైనా... పరువు పోయింది మాత్రం దర్శకులదే.  
  
ఈ ఏడాది వచ్చిన ఫ్లాపుల్లో 'శాకిని డాకిని' ఒకటి. ఆ సినిమాలో టేకింగ్ బాలేదనే కామెంట్స్ వినిపించాయి. అయితే... విడుదలకు ముందు దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయనే విషయం బయటకు వచ్చింది. సుధీర్ వర్మను సరిగా చేయనివ్వలేదని కామెంట్లు వినిపించాయి. అందువల్ల, ఆయన విమర్శల నుంచి తప్పించుకున్నారు. నిజంగా సినిమాలో ఆయన మార్క్ కనిపించిన సన్నివేశాలు కూడా తక్కువ. 


Also Read : 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది హీరోల హవా, టాప్ 10లో ముగ్గురు మనోళ్లే!