చల్లని ఉదయం, సాయంత్రం వేడి వేడి టీ లేదా కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ హాయే వేరు. అందుకే శీతాకాలంలో రోడ్డు పక్కన పెట్టి టీ షాపులు కిట కిట లాడేస్తాయి. ఎన్నిసార్లయినా టీ తాగేందుకు సిద్ధమైపోతారు చాలా మంది. రోజులో ఒకట్రెండు సార్లు తాగడం మంచిదే కానీ,మరీ ఎక్కువ సార్లు తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజుకు నాలుగైదు కప్పుల టీ, కాఫీ తాగడం వల్ల మీ శరీరంలో ఎంత కెఫీన్ చేరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది మనం శరీరంపై ప్రతికూలంగా పనిచేయడం మొదలవుతుంది. ఉదయం ఒక కప్పు, మధ్యలో మరో కప్పుతో సరిపెట్టుకోవాలి. సాయంత్రం అయిదు దాటాకా టీ తాగకపోవడమే ఉత్తమం. ఇది నిద్రపట్టకుండా చేస్తుంది. శీతాకాలంలో రోజుకు నాలుగైదు కప్పుల టీ తాగడం వల్ల వచ్చే నష్టాలేంటో తెలుసుకోండి.
మలబద్ధకం
చాలా మందికి ఈ సమస్య ఉన్నప్పటికీ, అది టీ, కాఫీలు అధికంగా తాగడం వల్ల కలిగి ఉంటుందని గ్రహించి ఉండరు. టీలో థియోఫిలిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమయంలో డీహైడ్రేషన్ అయ్యేలా చేసే రసాయనం. అధికంగా టీ, కాఫీలు తాగినప్పడు మరుసటి రోజు మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. టీ, కాఫీలకు బదులు వేడి నీళ్లు తాగితే అన్ని రకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
నిద్రా సమస్యలు
టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. అది మీ మెదడుకు నిద్ర పొమ్మని సంకేతాన్ని మోసుకెళ్లే మెలటోనిన్ హార్మోన్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. కెఫిన్ అధికంగా శరీరంలో చేరితే.. మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి, దీని ఫలితంగా నిద్ర సరిగా ఉండదు. నిద్ర పట్టకపోతే మానసికం, శారీరకంగా బలహీనంగా మారుతారు.
మానసిక ఆందోళన
శరీరంలో కొంచెంగా చేరిన కెఫీన్ ఉల్లాసాన్ని నింపుతుంది. అదే అధికంగా చేరితే చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. గుండె దడ, గాభరా, నిద్ర సరిగా పట్టకపోవడం, ఆందోళన వంటివి కలుగుతాయి.
యాసిడ్ రిఫ్లక్స్
ఉదయం పూట ఖాళీ పొట్టతో టీ తాగకూడదని ఎంతో మంది వాదిస్తారు. దీని వల్ల శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ జరిగే అవకాశం ఉంది. మీరు రోజులో రెండుకు మించి టీ, కాఫీలు తాగడం వల్ల కూడా ఇది జరుగుతుంది. రోజులో ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల పొట్టలో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది, ఇది నిద్రలో పీడకలలను వచ్చే అవకాశాన్ని పెంచుతుంది
క్యాన్సర్ వచ్చే అవకాశం?
ఇది పురుషులకు వర్తిస్తుంది. టీ అధికంగా తాగే మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని ఎన్న అధ్యయనాల్లో తేలింది. కాబట్టి మగవారు రోజుకు ఒకసారి టీతో సరిపెట్టుకోవాలి.
Also read: 20 మందిని చంపిన సీరియల్ కిల్లర్ పక్కనే కూర్చోవాల్సి వస్తే, పాపం ఆ మహిళ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.