Madhya Pradesh Cow:
మధ్యప్రదేశ్‌లో ఘటన..
మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆవుకి సింహం లాంటి దూడ పుట్టింది. దానికి గిట్టకు బదులుగా పంజా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెయిజెన్ జిల్లాలో జరిగిందీ ఘటన. గోర్ఖా గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లోని ఈ ఆవు దూడని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదో అద్భుతం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉన్నట్టుండి గ్రామంలో అలజడి రేగడం అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఆవు దూడని చూసేందుకు వచ్చారు. వెటర్నరి విభాగానికి చెందిన అధికారులు ఆ ఆవుని పరిశీలించారు. యుటెరస్‌లో సమస్య కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే...పుట్టిన లేగదూడ ఓ అరగంట వరకూ ఆరోగ్యంగానే కనిపించింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి చనిపోయింది. ఈ సింహం లాంటి దూడను చూసేందుకు వేరే గ్రామాల ప్రజలు కూడా తరలి వస్తున్నారు. ఎందుకిలా జరిగిందన్నది ప్రస్తుతం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
గతంలోనూ...
ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది. సోషల్ మీడియాలో ఈ శిశువు ఫోటోలు వైరల్ అయ్యాయి. కమలా రాజా విమెన్స్ అండ్ చైల్డ్ పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ శిశువు జన్మించింది. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయిపోయింది. సికందర్ కాంపు ప్రాంతానికి చెందిన ఆర్తి కుశ్వాహా అనే మహిళకు...ఆడ శిశువు జన్మించినట్టు వైద్యులు చెప్పారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. 2.3 కిలోల బరువుతో జన్మించినట్టు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే ప్రత్యేక వైద్యుల బృందం శిశువుని పరీక్షించింది. "పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. శారీరక వైకల్యం వల్లే ఇలా జరిగింది. సాధారణంగా...పిండం రెండుగా విడిపోయినప్పుడు కవలలు పుడతారు. కానీ...ఇక్కడ ఒకే పిండానికి అదనపు శరీర భాగాలు పెరిగాయి. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే మెడికల్ సైన్స్‌లో ఇస్కియోపాగస్ అంటారు. నడుము కింది భాగంలో మరో రెండు కాళ్లు అదనంగా పుట్టుకొచ్చాయి. కానీ...అవి ప్రస్తుతానికి ఎట కదలడం లేదు" అని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లల వైద్య నిపుణులు శిశువుని పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు.