National News : మద్య నియంత్రణ అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చేసి చూపించింది. మధ్యప్రదేశ్ లో అన్ని బార్లను మూసివేస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. షాపుల్లో పర్మిట్ రూములను కూడా అనుమతించబోమని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. లిక్కర్ షాపుల కాంట్రాక్ట్ రెన్యూవల్ ఛార్జీలను 10 శాతం పెంచుతామని అన్నారు. బార్ లు తెరవాలని ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, మత స్థలాల నుంచి మద్యం షాపుల దూరాన్ని 50 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచుతున్నామని అన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసే చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. రాష్ట్రంలో నియంత్రిత మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని మాజీ సీఎం ప్రస్తుత ఎంపీ ఉమాభారతి డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆమోదించిన కొత్త ఎక్సైజ్ పాలసీ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఏడాదిలోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బార్లు బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లుగా భావిస్తున్నారు.
దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కూడా 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ కాంగ్రెస్‌లో విభేదాలను ఆసరాగా చేసుకుని ఆ పార్టీలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న అంచనాలు వినిపిస్తున్న సమయంలో.. ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. మద్య నియంత్రణ అనే డిమాండ్ .. బీజేపీ నేతల నుంచే వచ్చింది. ఉమా భారతినే ఉద్యమం చేశారు. ఇప్పుడు ప్రజల కోరికేనన్నట్లుగా బార్లను రద్దు చేశారు. ఎన్నికలు పది నెలల్లో ఉండగా ఇలా చేయడం ఎన్నికల జిమ్మిక్కేనని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
2018లో జరిగిన ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే స్వల్ప మెజార్టీ వచ్చింది. చివరికి జ్యోతిరాదిత్య సింధియా పార్టీని ధిక్కరించి బీజేపీలో చేరిపోయారు. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. వీరిని బుజ్జగించి వెనక్కి రప్పించడంలో కమల్ నాథ్ విఫలమయ్యారు. చివరికి ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. బీజేప అధికారంలోకి వచ్చింది. చౌహాన్ మళ్లీ సీఎం అయ్యారు. సింధియా కేంద్ర మంత్రి అయ్యారు.