ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్‌, తొలిసారి నేరుగా తెలుగులోకి అడుగు పెట్టారు. ‘సార్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సితార ఎంటర్టైన్ మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా  నిర్మించిన ఈ సినిమాకు, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా విడుదలైన  ఈ సినిమా తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి‘ పేరుతో ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.  


3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సార్’


గత శుక్రవారం రిలీజైన ‘సార్’ సినిమా సూపర్ డూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 16.54 కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగులో ఇప్పటి వరకు విడుదలైన ఏ ధనుష్ సినిమా ఇంత మొత్తంలో వసూళ్లు సాధించలేదు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోని అన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించింది. ధనుష్ ‘సార్’ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. విడుదలైన తొలి రోజుతో పోల్చితే రెండో రోజు వసూళ్లు పెరిగాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 2.65 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు రూ. 3.15 కోట్ల షేర్ రాబట్టింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.5.80 కోట్లు సాధించింది. రూ. 10.54 కోట్ల గ్రాస్‌తో ధనుష్‌ ‘సార్’ సినిమా రెండో రోజుల్లో దుమ్ములేపేసింది. ఇవాళ్టితో ఈ మూవీ వసూళ్లు రూ. 15 కోట్లు దాటాయి.  


సార్’కు కలిసొచ్చిన అంశం ఏంటంటే?


ఈ వారంలో టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఈ అంశం ‘సార్’ సినిమాకు కలిసి వచ్చింది.  కిరణ్‌ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, ‘సార్’ సినిమాకే ప్రేక్షకులు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.  ఇక ‘సార్’  చిత్రంలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా,  సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్ మరియు హైపర్ ఆది కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి.


తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి..


ధనుష్ సౌత్, నార్త్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు.’రాంఝనా’, ‘ఆత్రంగి రే’ లాంటి హిందీ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. గత ఏడాది ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో విలన్ రోల్ పోషించారు. తన చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. అటు తెలుగు, తమిళ భాషల్లో ‘తిరు’, ‘నేనే వస్తున్నా’ లాంటి సినిమాలు విడుదలైనా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ‘సార్’  చేశారు. ఈ సినిమాతో ధనుష్ నేరుగా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.






Read Also: సింగర్‌గా మారిన మంచు లక్ష్మి - ‘నిర్వాణ శతకం’ సాంగ్ వైరల్