Hyderabad Crime News: హైదరాబాద్ రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల కుమారుడి పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే బాలుడి తండ్రి ఇటీవలే చనిపోవడం.. ఉన్న ఒక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలవడంతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.



 


అసలేం జరిగిందంటే..?


రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో ఓ ఇద్దరు బాలురు కింద కూర్చొని ఆడుకుంటున్నారు. ఇదే క్రమంలో కారు పార్కింగ్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. వారిపైకి దూసుకెళ్లాడు. ఓ బాలుడు వెంటనే తప్పించుకోగా.. మరో బాలుడు కారు కిందే ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి సదరు బాలుడిని కారు కింద నుంచి తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన బాలుడి పేరు జీవాన్ష్. సదరు బాలుడి తల్లిదండ్రులు శ్రావణి, సాయి. అయితే వీరు చిత్రపురి హెచ్ఐజీ-5- 705లో నివాసంలో ఉంటున్నారు. జీవాన్ష్ తండ్రి సాయి హెచ్ఐజీలో మేనేజర్ గా పని చేసేవాడు. కానీ ఆయన ఇటీవలే మరణించారు. ఈ బాధ నుంచి కుటుంబ సభ్యులు కోలుకోక ముందే.. మరో దెబ్బ తగలడంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బాలుడు జీవాన్ష్ మృత్యువుతో పోరాడుతున్నాడు. భర్తను కోల్పోయి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి.. కుమారుడికి ఏమవుతుందో అన్న బాధతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


నాలుగు రోజుల క్రితం చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ రహదారి 65పై.. ఆటో, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కేడ మృతి చెందగా.. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను కూడా వెంటనే అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది.


కాగా ఇదే రోజు 65వ నెంబర్ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ కుటుంబంతో నకిరేకల్ లో నివాసం ఉంటున్నాడు. కొర్లపహాడ్ కు వచ్చి బైక్ పై తిరిగి వెళ్తుండగా... టోల్ ప్లాజా దాటిన తర్వాత ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.