హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై జరిగిన రాళ్ల దాడి సంచలనం అయిన సంగతి తెలిసిందే. దానిపై ఎంపీ ఢిల్లీ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆదివారం (ఫిబ్రవరి 19) సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంపై 'అజ్ఞాత వ్యక్తులు' రాళ్ల దాడి చేశారని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. రాళ్లదాడి కారణంగా తన ఇంటి కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని విచారణ కూడా చేపట్టారు. ఈ అంశంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.


అసదుద్దీన్ ఒవైసీ ఇంటి పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఢిల్లీ పోలీసుల బృందం పరిశీలిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో ముఖ్య విషయం తెరపైకి వచ్చింది. ఒవైసీ ఇంటిపై కోతి రాయి విసిరి ఉండొచ్చని భావిస్తున్నారు.


కోతులు రాళ్లు విసరలేదు కదా?
నిజానికి ఒవైసీ ఇంటి నుంచి లుటియన్స్ జోన్‌లో కోతుల బెడద ఉంది. ఒవైసీ ఇంటి చుట్టూ వందలాది కోతులు కూడా ఉన్నాయి. ఒవైసీ ఇంటి పక్కనే ఉన్న ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల, కోతులను తరిమికొట్టేందుకు స్లింగ్‌షాట్‌తో ఉన్న వ్యక్తిని కూడా మోహరించారు. కోతులు తరచుగా అల్లర్లు సృష్టిస్తాయని కోతులను తరిమికొట్టేందుకు మోహరించిన వ్యక్తి చెప్పాడు. కొన్నిసార్లు ఆ కోతులు ట్యాప్ తెరుస్తాయని, ఇంకొన్ని అవి ఏదో ఒకవస్తువు లేదా బ్రెడ్ కనిపిస్తే దాన్ని తీసుకొని పారిపోతాయని చెప్పాడు. అయితే, ఈ వ్యక్తి కోతులు రాళ్లు రువ్వాయనే దాన్ని ఖండించాడు.


సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిజం బయటికి
ఢిల్లీ పోలీసు బృందం ఇప్పుడు సమీపంలోని ఇళ్లలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసి, రాళ్లదాడి గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటి వరకు సీసీటీవీలో అనుమానితులెవరూ కనిపించలేదని, రాళ్లు రువ్విన ఘటన కనిపించలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.






ఒవైసీ ఏం చెప్పారు?
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. 2014 తర్వాత తన ఇంటిపై ఇది నాలుగో దాడి అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. నా ఇంటి బయట చాలా కెమెరాలు అమర్చి ఉన్నాయని, వాటిని గుర్తించేందుకు వీలుగా నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.


ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీలోని తన ఇంటికి 11.30 గంటలకు తిరిగిరాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివాళ్లు చెప్పారని, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. రాజధాని నగరంలోని అశోకా రోడ్‌లో గల ఒవైసీ నివాసం దగ్గరకు ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో దుండగలు చేరుకుని రాళ్లు విసిరారని, ఒవైసీ ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. ‘‘అత్యధిక భద్రత గల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నా ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో తగినన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో దృశ్యాలను పరిశీలించి నిందితలును తక్షణమే అరెస్ట్ చేయాలి’’ అని ఒవైసీ తన ఫిర్యాదులో కోరారు.


ఈ రాళ్ల దాడిపై అసదుద్దీన్ దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ సారథ్యంలోని పోలీసుల బృందం ఒవైసీ ఇంటికి చేరుకుని ఆధారాలను సేకరించింది.