Chhattisgarh News: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఓ సంచలన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పదహారేళ్ల అమ్మాయి జుట్టును చేతపట్టుకొని.. రక్తం కారుతుండగానే ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన పోలీసులు కేసు నమోదు చేసి సదరు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశ్యంతో.. పోలీసులు సదరు బాలికను ఎలాగైతే నిందితుడు తీసుకెళ్లాడో వాళ్లు కూడా ఇదే రీతిలో ఊరేగిస్తూ.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అమానుష ఘటనను వీడియో తీసి నెట్టింట పెట్టిన యువకులు
రాయ్ పూర్ లోని గుఢియారీ ప్రాంతంలో 47 ఏళ్ల ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ అనే వ్యక్తి దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అతని వద్ద ఓ పదహారేళ్ల బాలిక పని చేస్తోంది. అయితే పలు రకాల కారణాలతో తన వద్ద ఉద్యోగం మానేస్తానని సదరు బాలిక చెప్పింది. దీనికి ఓంకార్ తివారీ ఒప్పుకోలేదు. అంతేకాకుండా శనివారం రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీనికి ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరించారు.
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఉన్న తివారీ రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక, ఆమె తల్లిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాలిక తల్లిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. వాళ్లను బెదిరించి బాలికకు రక్తం ధారాపాతంగా కారుతుండగానే... ఆమె జుట్టు పట్టుకొని రోడ్లపై ఈడ్చుకెళ్లాడు ఓంకార్ తివారీ. అయితే ఈ అమానుష ఘటనను పలువురు యువకులు వీడియో తీసి నెట్టింట పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టిన కాసేపట్లోనే ఇది వైరల్ గా మారింది. అలా పోలీసులకు చేరింది. అలాగే బాలిక సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఓంకార్ తివారీ..
ఈ ఘటనకు గల కారణాలను రాయ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. తన సోదరిపై దాడి జరిగిందని బాధితురాలి సోదరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు. ఓంకార్ తివారీ మసాలా దినుసులు అమ్మె దుకాణం నడుపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఓంకార్ తివారీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వెళ్లి అరెస్ట్ చేశారు. ఓంకార్ తివారీ రోడ్డుపై దొరికాడని.. అతనికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే అతని చెవి పట్టుకొని పట్టణంలోని రోడ్లపై ఊరేగించినట్లు వివరించారు. అయితే బాలిక మెడ, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయని.. ప్రస్తుతం ఆమె కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు.