Security Breach in Lok Sabha:



ప్రధాని మోదీ భేటీ..


పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై (Parliament Security Breach) రెండు సభల్లోనూ పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. కచ్చితంగా దీనిపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయంలో చాలా సేపటి వరకూ అలజడి కొనసాగింది. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌తో గొడవ పడినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్‌ని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి భేటీకి  పిలుపునిచ్చారు. భద్రతా వైఫల్యంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులతో పాటు భద్రతా అధికారులు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్‌ హాజరయ్యారు. అటు I.N.D.I.A కూటమి నేతలు కూడా సమావేశమయ్యారు. భద్రతా వైఫల్యంపై సభలో ఏం మాట్లాడాలో ఈ భేటీలో చర్చించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. అంతే కాదు. ఇదే విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మునీ కలవాలని భావిస్తున్నారు. అయితే...లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై ఆందోళన చేసినందుకు గానూ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈ ఆందోళనల కారణంగా ఆరుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు అధికారికంగా ఓ తీర్మానం విడుదల చేశారు. ఐదుగురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.