Visually Challenged People Voting: ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుని జాగ్రత్తగా మీట నొక్కండి అని చెబుతుంటారు అధికారులు. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే దూరం నుంచే మనకు సూచనలు చేస్తుంటారు. సరిగ్గా చూసుకుని మనకు (How Blind People Do Vote) నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేస్తాం. మనకి కళ్లు ఉన్నాయి కాబట్టి ఇంత పద్ధతిగా అన్నీ చూసుకుంటాం. మరి దృష్టిలోపం ఉన్న వాళ్ల సంగతేంటి..? వాళ్లు ఎలా ఓటు వేస్తారు..? వాళ్లు సరిగ్గా ఓటు వేసేలా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు..? దీని వెనకాల ఆసక్తికరమైన విషయాలెన్నో ఉన్నాయి. నిజానికి గతంలో అయితే...అంధులతో పాటు ఓ వ్యక్తి వచ్చేవాడు. వాళ్ల సాయంతో తమకు నచ్చిన (Blind People Voting) పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండేది. కానీ ఇలా రెండో వ్యక్తి జోక్యం లేకుండానే వాళ్లు సొంతగా ఓటు వేసే అవకాశం లేదా అన్న ఆలోచన చేశారు అధికారులు. అంధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమకు నచ్చిన అభ్యర్థి పేరుని,పార్టీ గుర్తుని గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో Braille Voter Slip ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఈ పద్ధతినే కొనసాగిస్తున్నారు. గతంలో ఢిల్లీలో ఎన్నికల సమయంలో ఏకంగా ఓటర్ కార్డ్‌లనూ బ్రెయిలీ లిపిలోనూ ప్రింట్ చేయించారు. అలా వాళ్లు సులువుగా తమ కార్డ్‌లోని వివరాలను సరి చూసుకునేందుకు వీలు కలిగింది. ఇక ఓటర్ స్లిప్‌లనూ బ్రెయిలీ లిపిలోనే తీసుకురావడం వల్ల ఓటు వేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. 


మాక్ ఓటింగ్‌..


అయితే...ఓటింగ్ జరగక ముందే ఇలా దృష్టి లోపం ఉన్న వాళ్లతో మాక్ ఓటింగ్ నిర్వహిస్తారు. National Association for the Blind (NAB),ఎన్నికల సంఘం కలిసి ఈ బ్రెయిలీ లిపి ఓటర్ స్లిప్‌లను తయారు చేస్తాయి. రహస్యంగా వీళ్లతో మాక్ పోలింగ్ చేస్తారు. NAB ఈ బ్రెయిలీ ఓటర్‌ స్లిప్‌లను ప్రింట్ చేసే బాధ్యత తీసుకుంది. 1952 నుంచి ఈ సంస్థ అంధుల కోసం అన్ని విధాలుగా అండగా ఉంటోంది. సాధారణ ప్రజలకు ఏమాత్రం తీసిపోరు అనే ధైర్యాన్ని వాళ్లలో నింపుతోంది. అందుకే...ఓటింగ్‌లోనూ వాళ్లకు సమాన అవకాశం కల్పిస్తోంది. ప్రత్యేకంగా బ్రెయిలీ ప్రెస్‌ ఏర్పాటు చేసి అందులోనే ఈ బ్యాలెట్ పేపర్‌లు (Braille Ballot Paper) ప్రింట్ చేస్తోంది. అంధులు వీటిని చేతి వేళ్లతో తాకి పార్టీ, అభ్యర్థి పేర్లను గుర్తించి దాని పక్కనే మీట నొక్కుతారు. ఇదంతా ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడైతే పోలింగ్ బూత్‌కి వెళ్తారో అక్కడ ఓటర్ బ్రెయిలీ స్లిప్‌ని కౌంటర్‌లో సబ్మిట్ చేస్తాడు. ఆ తరవాత అతనికి లేదా ఆమెకి బ్యాలెట్ పేపర్ అందిస్తారు. వాటిని ఓ సారి తరచి చూసుకుని ఓటు వేయొచ్చు. నిజానికి EVM మెషీన్‌లపైనా బ్రెయిలీ మార్కింగ్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా అంధులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇలా దృష్టి లోపం ఉన్న వాళ్లలో చాలా మంది వేరే వాళ్ల సాయం తీసుకోడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. వాళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లూ ఉన్నారు. అందుకే...టెక్నాలజీ ఆధారంగానే వాళ్లు సొంతగా ఓటు వేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. 2009లో బ్రెయిలీ బ్యాలెట్‌ పేపర్‌ని ప్రవేశపెట్టగా..బ్రెయిలీ ఓటర్ స్లిప్‌ని 2019లో తీసుకొచ్చారు.


Also Read: Prisoners Voting Rights: ఖైదీలకు ఓటు వేసే హక్కు ఎందుకు లేదు? ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది?