Voting Rights For Prisoners: ఓటు వేయడం అందరి బాధ్యత. దేశంలోని ప్రజలందరికీ సమానంగా లభించిన హక్కు ఇది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన (Lok Sabha Elections 2024) ప్రక్రియ. అందుకే ఓటర్లందరూ కచ్చితంగా ఓటు వేయాలని పిలుపునిస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్నేళ్లుగా ఓటర్లలో ఈ చైతన్యం బాగానే పెరిగింది. గతంలోలా బద్ధకించకుండా ఓటు హక్కు (Prisoners Voting Rights) వినియోగించుకుంటున్నారు. అయితే...అందరికీ ఓటు వేసే హక్కుందని మనం చెప్పుకుంటున్నా...ఖైదీలకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. వాళ్లకి ఓటు వేసే హక్కు కల్పించడం లేదు ప్రభుత్వం. వాళ్లు చేసిన నేరాలకు వేసిన శిక్షల్లో ఇది కూడా ఒకటి. అండర్ ట్రయల్ ఖైదీలకూ ఓటు వేసే హక్కు లేదు. దీనిపై చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Representation of People Actలోని సెక్షన్ 62 ప్రకారం నేరస్థులకు ఓటు హక్కు (Voting Rights For Prisoners) కల్పించడం లేదని ఎన్నికల సంఘం గతంలో చాలా సందర్భాల్లో తేల్చి చెప్పింది. అయినా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ వాదన తెరపైకి వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గతేడాది నుంచే ఈ చర్చ మొదలైంది. 


సుప్రీంకోర్టులో పిటిషన్..


గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఖైదీలకూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. దానిపై అప్పట్లో సుదీర్ఘ చర్చే జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భారత ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019లోనే ఢిల్లీ హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ దాఖలైంది. ఆ సమయంలోనూ కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. అప్పుడు ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఖైదీలకు ఓటు వేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే...అండర్ ట్రయల్ ఖైదీలు ఎన్నికల్లో పాల్గొనే అవకాశముంది కానీ ఓటు వేసే హక్కు మాత్రం లేదు. దీనిపైనే కొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు. Representation of the People Act, 1951లో సెక్షన్ 62(5)లో ఇది చాలా స్పష్టంగా రాసుంది. లీగల్ పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్లు, ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులు అని ఆ సెక్షన్ తేల్చిచెప్పింది. అదే సెక్షన్‌ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం (Election Commission) సమాధానమిస్తోంది. 


కోర్టు చెప్పిన కారణాలివే..


బ్యాలెట్‌ బాక్స్ పవిత్రతను కాపాడేందుకే ఖైదీలకు ఓటు హక్కు కల్పించడం లేదన్న వాదనపై సామాజిక కార్యకర్తలు భగ్గుమంటున్నారు. అయితే...1997లోనూ సుప్రీంకోర్టులో ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలంటూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు అందుకు కారణాలు కూడా వివరించింది. అందులో మొదటి కారణం...ఖైదీలు ఓటు వేయాలంటే దానికి భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఎవరూ తప్పించుకోకుండా భద్రత ఏర్పాటు చేయాలి. ఇది కాస్త సవాలుతో కూడుకున్న పని. ఇక సుప్రీంకోర్టు చెప్పిన రెండో కారణం...నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి మిగతా పౌరులతో సమాన హక్కుల్ని పొందలేడని, వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆ హక్కుని కల్పించలేమని తేల్చి చెప్పింది. ఇక మూడో కారణం...ఎన్నికల నుంచి నేరస్థులను దూరంగా ఉంచడం. అయితే...కొన్ని దేశాల్లో ఖైదీలకూ ఓటు హక్కు ఉంది. 18 ఐరోపా దేశాలు ఈ వెసులుబాటు కల్పించాయి. ఇరాన్‌, ఇజ్రాయేల్, పాకిస్థాన్‌లోనూ అక్కడి ప్రభుత్వాలు ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చాయి. 


Universal Declaration of Human Rights (UDHR)లోని ఆర్టికల్ 21 ప్రకారం...అర్హత కలిగిన ప్రతి పౌరుడికీ ఓటు వేసే హక్కు ఉంటుంది. జాతి, మతం, కులం, రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు, సామాజిక హోదాలన్నింటికీ అతీతంగా ఈ హక్కు కల్పించాలని తేల్చి చెబుతోంది ఈ ఆర్టికల్. భారత్‌లోనూ ఈ హక్కు కల్పించాలన్న డిమాండ్ వినిపించిన ప్రతిసారీ ఇవన్నీ చర్చకు వస్తాయి. అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిపై ఇలాంటి వివక్ష చూపించడం అనవసరం అని వాదిస్తుంటారు కొందరు. ఓ వ్యక్తిని జైల్‌లో పెట్టడంలో ఉద్దేశం కేవలం అతనిలో మార్పు రావాలనే తప్ప శిక్ష వేయాలని కాదు అని చెబుతున్నారు.