Duvvada Vani  will contest against YSRCP candidate Duvvada Srinivas  :  నామినేషన్లు వేసేటప్పుడు భర్తల తరపున భార్యలు.. భార్యల తరపున భర్తలు డమ్మీ నామినేషన్లు వేయడం చేస్తూంటారు. ఏదైనా సాంకేతిక కారణాలతో నామినేషన్ రిజెక్ట్ అయితే భార్య లేదా  భర్త బరిలో ఉంటారని ఇలా చేస్తారు. అయితే  రెబల్ గా పోటీ చేయడం దాదాపుగా లేదు. కానీ  రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. భర్తపై భార్య రెబల్ గా పోటీకి దిగుతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఇలా జరుగుతోంది.  


వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ఖరారు - అసంతృప్తికి గురైన దువ్వాడ వాణి         


 టెక్కలి ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా టెక్కలి నుంచి పోటీ చేయనున్నట్లు గురువారం ప్రకటించారు.  ఈ నెల 22న ఆమె నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు టెక్కలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో కొంత కాలంగా నెలకొన్న వివాదం ఆయన్ను వెంటాడుతూనే ఉంది. పార్టీ అధిష్టానం  జోక్యం చేసుకుని ఇరువరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ ఒప్పందంలో భాగంగా శ్రీనివాస్‌ స్థానంలో వాణిని గతేడాది మేలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలను మార్పు చేసింది. దువ్వాడ వాణిని మార్చి మళ్లీ శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇచ్చారు. 


స్వతంత్రంగా పోటీ చేాయలని దువ్వాడ వాణి నిర్ణయం                                                              


తనను ఇంచార్జ్ గా నియమించినా టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో దువ్వాడ వాణి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గెలుపునకు సహకరించాలని, ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా  ఆమె అంగీకరించలేదు.  దువ్వాడ వాణి టెక్కలి బరిలో ఉంటే దువ్వాడ గెలుపు కష్టంగా మారుతుందన్న చర్చ నడుస్తోంది. 


రాజకీయంగా అనుభవం ఉన్న దువ్వాడ వాణి                


దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె టెక్కలి నుంచి   జెడ్‌పిటిసిగా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ హయాంలోనూ టెక్కలి జెడ్‌పిటిసి సభ్యులుగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేసిన ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషించారు. వాణి తండ్రి సంపతిరావు రాఘవరావు కూడా 1985, 1994, 1996 ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ప్రస్తుతం విడాకులు తీసుకోకపోయినప్పటికీ వారిద్దరూ కలిసి లేరని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.