Lok Sabha Elections First Phase: దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు అంతా సిద్ధమైంది. మొత్తం 7 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడత ఇవాళ (ఏప్రిల్ 19) మొదలు కానుంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆ తరవాత ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్‌తో ఈ ప్రక్రియ అంతా ముగిసిపోనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే మొదటి విడతలో యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోం, బిహార్, పశ్చిమ బెంగాల్,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, సిక్కిం, జమ్ముకశ్మీర్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
వీటిలో అత్యధికంగా తమిళనాడులో ఒకేసారి మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ వేసే అవకాశమిస్తారు. రాజస్థాన్‌లో 12 సీట్‌లు, యూపీలో 8 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో ఆరు స్థానాలు, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్‌లో ఐదు..ఇలా ఆయా రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాబితాలో పుదుచ్చేరి, లక్షద్వీప్ కూడా ఉన్నాయి. ఉత్తరాదిలో పట్టు సాధించిన బీజేపీ ఈ సారి తమిళనాడుపై గురి పెట్టింది. అక్కడ ఎలా అయినా ఉనికి నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే కచ్చతీవు ద్వీప వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి అక్కడి రాజకీయాలు మారిపోయాయి. మొదటి విడతలోనే దక్షిణాది రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుండడం వల్ల ఆసక్తి నెలకొంది.
కీలక అభ్యర్థులు వీళ్లే..
మొదటి విడతలో కీలక అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. ఇక తమిళనాడులో తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగారు. మొన్నటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఆ తరవాత పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇక తమిళనాడులోనే బీజేపీ చీఫ్ అన్నమలై పోటీ ఆసక్తికరంగా మారింది. కోయంబత్తూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి దయానిధి మారన్ బరిలోకి దిగారు. కర్ణాటకలోని శివగంగ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కార్తీ చిదంబరం బరిలోకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కొడుకు నకుల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
Also Read: Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే