Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారం ఒకేసారి 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉండనున్నాయి. వీళ్లతో పాటు మరి కొంత మంది కీలక నేతల పేర్లను ప్రకటించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వచ్చే వారం భేటీ కానుంది. ఆ తరవాతే ఈ జాబితాని విడుదల చేయనుంది. మొత్తం 543 సీట్‌లున్న లోక్‌సభ ఎన్నికల్లో 370 చోట్ల కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. బీజేపీ కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు ప్రధాని మోదీ. అందుకే...మొదటి జాబితాపై ఎక్కువగా ఫోకస్ చేసింది. అయితే...ఈ జాబితాని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎంపీగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో 3.37 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరవాత 2019లో 4.8 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు నరేంద్ర మోదీ. ఇక అమిత్ షా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు వరకూ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ అదే నియోజవర్గం నుంచి పోటీ చేశారు. గత వారమే బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 100 రోజులు ఎంతో కీలకం అని, 370 చోట్ల గెలిచేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
బీజేపీ జాతీయ సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అందరూ ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడాలని సూచించారు. 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో అవినీతి మరక లేకుండా పరిపాలించామని గుర్తు చేశారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, దేశమే ముఖ్యమని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలవి అబద్ధపు వాగ్దానాలు అని మండి పడ్డారు. వికాస్ భారత్ అనే హామీని తమ ప్రభుత్వం తప్ప మరెవరూ ఇవ్వలేదని అన్నారు. 500 ఏళ్ల కలని నెరవేరుస్తూ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తలంతా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. 18 ఏళ్లు నిండిన వారు ఈసారి 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత ఏడాదిన్నరగా సైలెంట్‌గా పని చేసుకుంటూ పోతున్నామని వెల్లడించారు ప్రధాని మోదీ. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పం అని స్పష్టం చేశారు. వికసిత్ భారత్‌కి తనదే గ్యారెంటీ అని తేల్చి చెప్పారు.
Also Read: ర్యాపిడో డ్రైవర్‌పై దుండగుల దాడి, 23 సార్లు కత్తితో పొడిచి మొబైల్ చోరీ