UP Lok Sabha Election Results 2024: భారీ లక్ష్యం నిర్దేశించుకున్న అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు ఉండాలి. ఎత్తులకు పై ఎత్తులు వేసి సవాళ్లను చిత్తు చేయాలి. ఇదంతా బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. కానీ...ఈ సారి మాత్రం ఎందుకో కొన్ని చోట్ల పాచికలు పారలేదు. సొంతగా మెజార్టీ సాధించలేకపోయింది. 241 దగ్గరే సీట్ల సంఖ్య ఆగిపోయింది. ఎందుకిలా జరిగింది..? ఎక్కడ బెడిసి కొట్టింది..అని విశ్లేషించుకుంటే ముందుగా కనిపించే సమాధానం ఉత్తరప్రదేశ్. నార్త్‌బెల్ట్‌లో యూపీ బీజేపీ కోట. యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఆ రాష్ట్రం (Why BJP Lost in UP) దూసుకుపోతోంది. బుల్‌డోజర్ సీఎంగా యోగి పేరు సంపాదించుకున్నారు. గ్యాంగ్‌స్టర్‌ల ఏరివేతలోనూ నిర్దాక్షణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చోట బీజేపీకి షాక్ తగులుతుందని ఎవరైనా ఊహిస్తారా..? కానీ అది ఈ ఎన్నికల్లో జరిగింది.
మొత్తం 80 ఎంపీ స్థానాలున్న యూపీలో NDA కూటమి 36 స్థానాలకే పరిమితమైంది. అటు ఇండీ కూటమి మాత్రం సగానికి పైగా 43 చోట్ల గెలుపొందింది. యూపీని మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని బలంగా నమ్మిన కాషాయ దళానికి (Lok Sabha Election Results 2024) ఇది ఝలక్ ఇచ్చింది. ఈ ప్రభావం మొత్తం సీట్ల సంఖ్యపై పడింది. యూపీలో 60కి పైగా సీట్లు వచ్చుంటే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి వచ్చేది. కానీ యూపీ ఓటర్లు వేసిన బ్రేక్‌తో మిత్రపక్షాలపై ఆధార పడాల్సి వచ్చింది. అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికలపై కనిపించలేదు. ఈ స్థాయిలో యూపీలో బీజేపీ ఎందుకు వెనకబడింది..?
కారణాలివేనా..?
Do Ladkon ki Jodi. రాహుల్ గాంధీ, ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ని ఉద్దేశించి రాష్ట్రంలో బాగా వినిపించిన మాట ఇది. ఇద్దరూ కలిసి ఈ సారి చాలా గట్టిగా ప్రచారం చేశారు. గతంలోనూ వీళ్లిద్దరూ కలిసి ప్రచారం చేసినా అప్పుడు బీజేపీని సరిగా ఎదుర్కోలేకపోయారు. రాహుల్ గాంధీ బాగా టార్గెట్ చేసిన అంశం రాజ్యాంగం. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే కాదు. OBC,SC,ST రిజర్వేషన్‌లు రద్దు చేసి అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తారనీ ఆరోపించారు. 400 సాధించాలని అందుకే మోదీ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుందని ఎన్‌కౌంటర్ మొదలు పెట్టారు. ఎన్నిసార్లు మోదీ సహా కీలక బీజేపీ నేతలు దీనిపై క్లారిటీ ఇచ్చినా రాహుల్ వేసిన పాచిక గట్టిగానే పారింది. ఈ అంశం జనాల్లోకి బాగా వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు మైనార్టీల ఓట్లను దూరం చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు దేశ సంపదను దోచి పెడతారని తీవ్ర ఆరోపణలు చేశారు. "ఎక్కువ మంది పిల్లలున్న ముస్లింలకు" అంటూ కాస్త నోరు జారారు. ఎప్పుడూ మత ప్రస్తావన తీసుకురాకుండా హుందాగా మాట్లాడే మోదీ ఈ సారి మాత్రం ట్రాక్ తప్పారన్న వాదన వినిపించింది. అదే ఎఫెక్ట్ ఫలితాలపై కనిపించింది.
అభ్యర్థుల ఎంపికలో తడబాటు..
ఇక అభ్యర్థులను నిలబెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే బీజేపీ ఈ సారి తడబడింది. సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత ఉన్నా రకరకాల సర్వేలు చేయించి వాళ్లే సరైన అభ్యర్థులు అని ప్రకటించింది. గత ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో గెలిచిన వాళ్లకీ మళ్లీ టికెట్‌లు ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీల్లో కనీసం 35% మందిని పక్కన పెట్టాలని ముందు అనుకున్నా ఆ తరవాత కేవలం 14 మందినే మార్చింది. ఈ ప్రభావం కనీసం 10 చోట్ల కనిపించింది. ఇది కాకుండా రాజ్‌పుత్ వర్గానికి చెందిన వాళ్లకి పెద్దగా టికెట్‌లు ఇవ్వకపోవడం, పూర్తిగా యాదవేతర OBCలకే ప్రాధాన్యతనివ్వడం బెడిసికొట్టింది. పశ్చిమ యూపీలో 10% మేర ఉన్న రాజ్‌పుత్ జనాభా చాలా రోజులుగా యూపీ సర్కార్‌పై అసహనంతో ఉంది. తమను ఏ మాత్రం గుర్తించడం లేదని మండి పడుతోంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీని బైకాట్ చేయాలంటూ ఆ వర్గంలోని కీలక నేతలంతా తేల్చిచెప్పారు. ఇది కూడా చాలా వరకూ కాషాయ దళానికి షాక్ ఇచ్చింది.
అయోధ్య రామ మందిరం ప్రభావమేది..?
ఇక స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలూ బీజేపీని మెజార్టీ మార్క్‌కి దూరం చేశాయి. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు ఇబ్బంది పెట్టాయి. అత్యంత కీలకంగా అగ్నివీర్ స్కీమ్ గట్టి దెబ్బ కొట్టింది. సాధారణంగా ఆర్మీకి వెళ్లే వాళ్లలో బిహార్, యూపీ వాళ్లు ఎక్కువగా ఉంటారు. అయితే...అగ్నివీర్‌తో తమకు ఉద్యోగ భద్రత లేదని రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బాగా జనాల్లోకి వెళ్లింది. అక్కడ కూడా అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉంటుందని, నాలుగేళ్ల శిక్షణ తరవాత మిగతా వాళ్లని ఇంటికి పంపేస్తారని ప్రచారం చేశారు రాహుల్. ఈ అభద్రతా భావం కొంత వరకూ బీజేపీని వాళ్లకి దూరం చేసింది.
హిందూ అజెండాతో ఈ సారి ఎన్నికల ప్రచారం చేయడం వల్ల మైనార్టీలు దూరమయ్యారు. ప్రతిపక్ష కూటమికి 85% మేర మైనార్టీ ఓట్లు పడగా బీజేపీకి కేవలం 6% ఓట్లు మాత్రమే వచ్చాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని పక్కన పెడతారన్న ప్రచారమూ జరిగింది. రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్‌లో కీలక వ్యక్తుల్ని పక్కన పెట్టి వేరే వాళ్లకి సీఎం పదవులు కట్టబెట్టడం ఈ వాదనకు బలం చేకూర్చింది. రేపు యోగిని కూడా ఇలాగే పక్కన పెడతారేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ క్రెడిబిలిటీకి ఇదో మచ్చలా మారింది. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓడడం మరో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడం వల్ల బీజేపీ రేసులో వెనకబడింది.
Also Read: PM Modi Swearing: ప్రధాని పదవికి మోదీ రాజీనామా, ఆమోదించిన రాష్ట్రపతి - 8వ తేదీన ప్రమాణ స్వీకారం