Election Results 2024: ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాకే ఇచ్చాయి. సీట్ల సంఖ్య తగ్గడంతో పాటు కేంద్ర మంత్రులూ ఓటమి చవి చూశారు. స్మృతి ఇరానీ, అజయ్ మిశ్రా తేని, అర్జున్ ముండా ఈ సారి ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. బీజేపీ చాలా బలంగా హిందీ బెల్ట్‌లో వీళ్లు ఓడిపోవడం ఆ పార్టీని మరింత టెన్షన్ పెట్టింది. 2014,2019 తో పోల్చుకుంటే మెజార్టీ బాగా తగ్గిపోయింది. 2014లో 282, 2019లో 303 చోట్ల విజయం సాధించింది బీజేపీ. ఈ సారి మాత్రం 241 దగ్గరే ఆగిపోయింది. ఇదే షాక్‌ ఇవ్వగా కేంద్రమంత్రులూ ఓడిపోవడం మరింత ఆందోళన కలిగించింది. 2019లో అమేథి నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ పోటీ పడ్డారు. అప్పుడు భారీ మెజార్టీతో విజయం సాధించిన స్మృతి ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి LK శర్మ చేతిలో లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథిని స్మృతి ఇరానీ చేజిక్కించుకున్నా..దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మళ్లీ ఇప్పుడు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ చేతికే వెళ్లింది. 


మరో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేని లఖింపూరి ఖేరి నియోజకవర్గంలో పోటీ చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ రైతులు అప్పట్లో ఇక్కడ ఆందోళన చేపట్టారు. అయితే ఆ రైతుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించడం, జీప్‌తో తొక్కించడం, ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోడం వల్ల విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీపై వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఝార్ఖండ్‌లోని కుంతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కాళిచరన్ ముండా చేతిలో ఓడిపోయారు. మరో కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి రాజస్థాన్‌లోని బర్మేర్‌లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కీ తిరువనంతపురం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌కే ప్రజలు  మెజార్టీ ఇచ్చారు. వీళ్లతో పాటు మరి కొందరు కేంద్రమంత్రులు మహేంద్ర నాథ్ పాండే, ఆర్‌కే సింగ్, వి మురళీధరన్, సుభాస్ సర్కార్ కూడా ఓటమిపాలయ్యారు.