AP Cid Chief Sanjay On Leave: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ సీఐడీ (AP CID) అడిషనల్ డీజీ సంజయ్‌ (Sanjay) సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5 నుంచి జులై 3 వరకూ ఆయన సెలవు పెట్టారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆయన సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ వంటి కేసుల్లో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చంద్రబాబును అరెస్ట్ కూడా చేశారు.


టీడీపీ విమర్శలు పట్టించుకోకుండా..


అయితే, కక్షపూరితంగానే చంద్రబాబుపై సీఐడీ తప్పుడు కేసులు పెట్టిందని టీడీపీ నేతలు విమర్శించారు. సీఎం జగన్ కు అనుకూలంగా ప్రతిపక్షాలను సీఐడీ టార్గెట్ చేసిందనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న క్రమంలో సీఐడీ బాస్ సంజయ్ సెలవుపై వెళ్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. అటు, ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకూ వేరే అధికారులకు సీఐడీ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి సంజయ్ తిరిగొచ్చిన తర్వాత సీఐడీ చీఫ్‌గా రీ పోస్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఏజీ రాజీనామా


అటు, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుబ్రమణ్యం శ్రీరామ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. అటు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు కొందరు తమ రాజీనామా లేఖలను నియామక అథార్టీ అయిన ఏజీకి సమర్పించారు.


మెడికల్ లీవ్‌లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్


మరోవైపు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుకు పంపించారు. అయితే, రాజీనామాను ఆమోదించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం లేకపోవడంతో.. ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకూ ఆయనకు సెలవు మంజూరు చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు చూసిన ఆయన కొన్ని కీలక దస్త్రాలు మాయం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


టీటీడీ ఛైర్మన్ రాజీనామా


అటు, ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవంతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈవో ధర్మారెడ్డికి పంపించారు. గతేడాది ఆగస్టులో ఆయన తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, అభివృద్ధి పనుల పేరిట దేవస్థానం నిధులను పక్కదారి పట్టించారని ఆయన్ను పలుమార్లు ప్రతిపక్షాలు విమర్శించాయి.


సెలవులో టీటీడీ ఈవో.?


మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సైతం వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి 10 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.