Andhra Pradesh Elections Results 2024: ఏపీ ఎన్నికల్లో కూటమి సూపర్‌ హిట్ అయింది.  టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపారు.  వైసీపీకి ఊచకోత కోశారు. గెలిచిన అభ్యర్థుల్లో కొందరు ప్రత్యర్థులను చిత్తు చేసి భారీ మెజారిటీ సొంత చేసుకోగా... మరికొందరు అభ్యర్థులకు అత్యల్ప మెజారిటీతో కష్టమ్మీద విజయాన్ని ముద్దాడారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వారు భారీ మెజారిటీతో గెలిచిన వారిలో ఉండగా స్వల్ప తేడాతో ఓడిపోయిన వారిలో ధర్మవరం సిటింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు. ఆ విశేషాలు మీకోసం. 


అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు వీరే.. 


విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ రావు తన సమీప వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై 95,235 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. శ్రీనివాస్ రావుకు 1,57,703 ఓట్లు రాగా అమర్ నాథ్ కు 62,466 ఓట్లు మాత్రమే వచ్చాయి. 


విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన సమీప వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గంటాకు 1,76,230 ఓట్లు కాగా ముత్తంశెట్టికి   83,829 ఓట్లు వచ్చాయి. 


గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 91,413 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై గెలుపొందారు. లోకేశ్ కు 1,67,710 ఓట్లు రాగా, లావణ్యకు 76,297 ఓట్లు వచ్చాయి. 


కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పట్నం వెంకటేశ్వరరావు (1,34,414)  సమీప  వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు(62,374)పై 72,040 ఓట్ల మెజారిటితో గెలిచారు.   


నెల్లూరు సిటీ నియోజకర్గంలో టీడీపీ అభ్యర్థి నారాయణ (1,20,551)  తన సమీప వైకాపా అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌(48,062)పై 72,489 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 


రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (1,23,291) తన సమీప వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్(51,887)పై  71,404 ఓట్ల తేడాతో గెలిచారు. 


కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (1,34,394) తన సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీత(64,115)పై 70,279 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 


అత్యల్ప మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు వీరే.. 



  • శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర (ఎస్ సీ) నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి ఎం ఎస్ రాజు 351 ఓట్ల అత్యల్ప మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి ఇరలక్కప్పపై విజయం సాధించారు. రాజుకు 79,983 ఓట్లు రాగా ఇరలక్కప్పకు  79,632 ఓట్లు లభించాయి. 

  • ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తన సమీప అభ్యర్థి కుండురు నాగార్జున రెడ్డిపై 973 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అశోక్ రెడ్డికి 98,463 ఓట్లు రాగా, నాగార్జున రెడ్డికి 97,490 ఓట్లు వచ్చాయి. 

  • అన్నమయ్య జిల్లాకెు చెందిన రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మందిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సమీప వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై 2,495 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాంప్రసాద్ రెడ్డికి 95,925 ఓట్లురాగా,  శ్రీకాంత్ రెడ్డికి  93,430 వచ్చాయి. 

  • తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమీప వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్ పై 3,739 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  ఆదిమూలానికి 85,471 ఓట్లు రాగా రాజేశ్ కు  81,732 ఓట్లు వచ్చాయి.

  • శ్రీ సత్యసాయి జిల్లా కి చెందిన ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్  తన సమీప వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3,734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సత్యకుమార్ కు 1,06,544 ఓట్లురాగా, కేతిరెడ్డికి 1,02,810 ఓట్లొచ్చాయి. కేతి రెడ్డి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండటమే కాకుండా హలో ధర్మవరం కార్యక్రమంలో ప్రజలకు చేరువైనప్పటికీ కూటమి హవాలో ఓటమి చవిచూడక తప్పలేదు. 

  • ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శిపప్రసాద్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2,456 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.  శివప్రసాద్ రెడ్డికి 1,01,889 ఓట్లు రాగా లక్ష్మికి 99,433 ఓట్లు వచ్చాయి. 

  •  కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బి. విరూపాక్షి2,831 ఓట్లతో సమీప టీడీపీ అభ్యర్థి బి. వీరభధ్ర గౌడ్ పై విజయం సాధించారు.  విరూపాక్షికి 1,00,264 ఓట్లు రాగా వీరభద్ర గౌడ్ కి 97,433 ఓట్లు వచ్చాయి.