Telangana Lok sabha Result: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే... జాతీయ పార్టీలకే జైకొట్టారు తెలంగాణ ఓటర్లు (Telangana voters). ప్రాంతీయ పార్టీ అయిన భారత రాష్ట్ర పార్టీ (BRS)ను పక్కన పెట్టి... కాంగ్రెస్ (congress)‌, బీజేపీ  (BJP)కు ఓట్లు గుద్దేశారు. దీంతో... రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 8 సీట్లను సాధించింది అధికార కాంగ్రెస్‌ పార్టీ మొదటిస్థానంలో నిలిచింది. కమలం పార్టీకి కూడా కాంగ్రెస్‌తో సమానంగానే ఎనిమిది ఎంపీలు స్థానాలు ఇచ్చారు. ఐఎంఐ పార్టీ ఒక  ఎంపీ స్థానం దక్కించుకుంది. కానీ.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ.. ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. అంతేకాదు... ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటు శాతం కూడా భారీగా తగ్గింది.  మరోవైపు.. బీజేపీ ఓటు శాతం భారీగా పెరిగింది. కమలం పార్టీ.. తెలంగాణలో రెండో స్థానానికి చేరుకుంది.


ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు..?
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అత్యధికంగా 87లక్షల 41 వేల ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39శాతం ఓట్లు.. 64 సీట్లు రాగా... లోక్‌సభ ఎన్నికల్లో ఓటు శాతం ఇంకాస్త పెరిగి... 40.10శాతానికి చేరింది. బీజేపీ ఓటు శాతం మాత్రం భారీగా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కించుకుంది కమలం పార్టీ. కానీ.. ఎంపీ ఎన్నికల్లో సీన్‌ మారింది. బీజేపీ బాగా బలపడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే... 21శాతం ఓటింగ్‌ను పెంచుకుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 76లక్షల 47వేలకుపైగా ఓట్లు పడగా... ఓటింగ్‌ శాతం 35శాతంగా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి 22శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక.. బీఆర్‌ఎస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ పడింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోగా... ఓటు శాతం కూడా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37శాతానికి పైగా ఓటు శాతం సాధించిన బీఆర్‌ఎస్‌కు... ఎంపీ ఎన్నికల్లో 16.70 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 36లక్షల 37వేల ఓట్లతో మూడు స్థానంలో నిలిచింది గులాబీ పార్టీ.


బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి పడ్డాయా..?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. బీజేపీ ఓటు శాతం కూడా భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 21 శాతం ఓటింగ్‌ పెరిగింది కాషాయ పార్టీకి. ఈ ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌వే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే...  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు రాగా... ఎంపీ ఎన్నికల్లో స్వల్పంగా పెరిగి 40శాతానికి చేరింది. అదే బీఆర్‌ఎస్‌ సంగతి చూస్తే... అసెంబ్లీ ఎన్నికల్లో 37శాతం ఉండగా.. ఎంపీ ఎన్నికల్లో 16.07 శాతానికి పడిపోయింది. ఈ ఓట్లన్నీ బీజేపీకి  పడటం వల్లే... బీజేపీ ఓటు శాతం పెరిగిందని అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేసినట్టు చెప్తున్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ను పక్కపెట్టారని... జాతీయ పార్టీలు అయిన  కాంగ్రెస్‌, బీజేపీకే ఓట్లు వేసుంటారని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటు కూడా బీజేపీ బదిలీ అయ్యిండొచ్చని చెప్తున్నారు.