Lok Sabha Elections 2024 Schedule: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్‌ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ  ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ సీట్లున్నాయి. ఇక్కడ ఏప్రిల్ 19న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక సిక్కిం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. మే 13వ తేదీన తొలి విడత, మే 20న మలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. 






ఎన్నికల ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు రాజీవ్ కుమార్. ప్రజాస్వామ్యయుతంగానే ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జూన్ 16వతేదీన లోక్‌సభ గడువు ముగుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌లో ముగిసిపోనున్నట్టు వివరించారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయినట్టు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు కోటిన్నర మంది పోలింగ్ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియని పరిశీలించనున్నారు. సెక్యూరిటీ స్టాఫ్‌నీ నియమించనున్నట్టు ఈసీ వెల్లడించింది. 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని వెల్లడించారు. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య కోటి 80 లక్షల వరకూ ఉందని తెలిపారు. 20-29 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 19.47 కోట్లుగా ఉంది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు (Vote From Home) కల్పిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జూన్ 16లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు. 



పోలింగ్ స్టేషన్ల వద్ద ఉండే సౌకర్యాలివే..


తాగునీరు
టాయిలెట్స్
దివ్యాంగుల కోసం ర్యాంప్‌ లేదా వీల్‌ఛైర్‌లు
హెల్ప్ డెస్క్
ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్