O Yeong-su Sentenced To Jail: ఒక నటుడిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక్క పాపులర్ సినిమా, సిరీస్‌లో నటించినా చాలు.. అలా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా తెరకెక్కిన ‘స్క్విడ్ గేమ్’లో నటించి పాపులారిటీని సంపాదించుకున్నాడు ఓ యోంగ్-సు. 79 ఏళ్ల ఈ నటుడిపై లైంగిక వేధింపుల కేసు ఫైల్ అవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా తనపై కేసు ఫైల్ అవ్వడం, దానివల్ల తనకు 8 ఏళ్ల జైలుశిక్ష ఖరారు అవ్వడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. సపోర్టింగ్ రోల్‌తో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించిన ఒకేఒక్క సౌత్ కొరియాకు చెందిన నటుడిగా ఓ యోంగ్-సు గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ ఆ గుర్తింపు మొత్తం ఈ కేసుతో నాశనమైపోయింది.


నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర..


లైంగిక వేధింపుల కేసులో సువోన్ జిల్లా కోర్టుకు చెందిన సియోన్‌గ్నమ్ బ్రాంచ్.. ఓ యోంగ్-సుకు 8 ఏళ్లు జైలుశిక్షను విధించింది. అంతే కాకుండా తనకు ఇండస్ట్రీ నుంచి రెండేళ్లు సస్పెండ్ కూడా చేసింది. జైలుశిక్షను విధించిన తర్వాత 40 గంటల పాటు లైంగిక వేధింపుల ట్రీట్మెంట్‌కు ఓ యోంగ్-సు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అయిన ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్‌లో ఓ యోంగ్-సు నటన అందరినీ ఆకట్టుకుంది. అందులో తను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. అయితే తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. 2017లో ఇదంతా మొదలయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితురాలు న్యాయం కోసం పోరాడుతోంది.


అదంతా అబద్ధమే..


2017లో మొదటిసారిగా ఓ యోంగ్-సుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించాయి. అయితే అప్పుడు ఈ విషయాన్ని తను ఖండించాడు. తాను ఏ తప్పు చేయలేదని ధృడంగా నిలబడ్డాడు. కానీ ఓ యోంగ్-సు చెప్పేది అబద్ధమని కోర్టు కొట్టిపారేసింది. బాధితురాలి స్టేట్‌మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని, ఆ బాధను అనుభవించకుండా ఎవరూ అలాంటి ఆరోపణలు చేయలేరని జడ్జి జియోంగ్ యోన్-జు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2017లో ఒక థియేటర్ పర్ఫార్మెన్స్ కోసం ఒక పల్లెటూరిలో కొన్నిరోజుల పాటు గడిపాడు ఓ యోంగ్-సు. అప్పుడు తను బాధితురాలు ఇంటి ఎదురుగానే ఉండేవాడని సమాచారం. అదే సమయంలో బాధితురాలిని తను లైంగికంగా వేధించాడని తెలుస్తోంది.


నేను నిర్దోషిని..


కోర్టు జైలుశిక్ష అని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఓ యోంగ్-సు తన తప్పును ఒప్పుకోలేదు. కోర్టు నుంచి బయటికి వెళ్తూ రిపోర్టర్స్‌తో తాను నిర్దోషి అని చెప్పాడు. అంతే కాకుండా ఈ కేసుకు వ్యతిరేకంగా పోరాడడానికి తనకు వారం రోజులు సమయం ఉందని, పోరాడి చూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. బాధితురాలు చెప్పేదంతా అబద్ధమని అన్నాడు. 2021లో ఓ యోంగ్-సు నటించిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ మొదటి సీజన్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ ముందుకు వచ్చింది. ఇక విడుదలయిన నాలుగు వారాలలోపే 111 మిలియన్ వ్యూయర్స్‌ను సంపాదించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లలో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న సిరీస్‌ లిస్ట్‌లో ‘స్క్విడ్ గేమ్’ పేరు కచ్చితంగా ఉంటుంది. 


Also Read: ఓ ఇంటి కోడలైన వెంకటేష్ రెండో కుమార్తె - అల్లుడితో విక్టరీ దంపతుల్ని చూడండి