Kavtiha Comments in Delhi Court: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (Mlc Kavitha) అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) హాజరుపరిచారు. భారీ భద్రత నడుమ ఆమెను కోర్టుకు తీసుకెళ్తుండగా.. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. తనది అక్రమ అరెస్ట్ అని చెప్పారు. 'నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు. ఈడీ చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసు ఓ కట్టుకథ. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తాను.' అని పేర్కొన్నారు. తనను నిన్నటి నుంచి న్యాయవాదులతో మాట్లాడనివ్వలేదని.. మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొస్తామని 11 గంటలకు తీసుకొచ్చారని అన్నారు. 






అటు, కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపించనుండగా.. ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్, ఎన్.కె మట్టా వాదనలు వినిపించనున్నారు. ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ విచారించనున్నారు. కవితను విచారణ నిమిత్తం 7 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరనుంది. కోర్టు హాల్ లోనే ఈడీ అధికారులు భానుమతి, జోగేందర్ ఉన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి విచారణ చూసేందుకు వచ్చారు.


కవిత లాయర్ల వాదనలివే


కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన వెంటనే కవిత తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. 'ఈడీ అధికారులు అధికార దుర్వినియోగం చేశారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఉల్లంఘించారు. తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పారు. కానీ అలా జరగలేదు. మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్ లో ఉంది. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ కు ఈడీ కట్టుబడి లేదు.' అంటూ కోర్టుకు తెలిపారు.


Also Read: KTR News : చంద్రబాబు కంటే బాగా చెప్పలేను- కవిత అరెస్టుపై కేటీఆర్‌ ట్వీట్