Premi Vishwanath Karthika Deepam 2: ‘కార్తీక దీపం’లో దీపగా, వంటలక్కగా ఎన్నో ఏళ్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు ప్రేమి విశ్వనాథ్. ముందుగా తన మాతృభాష మలయాళంలో ‘కరుత ముతు’ అనే సీరియల్‌తో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ప్రేమి.. అదే సీరియల్‌ను తెలుగులో ‘కార్తీక దీపం’గా రీమేక్ చేయడంతో తెలుగు బుల్లితెరపైకి అడుగుపెట్టారు. ఇక ఈ సీరియల్ ముగిసిపోవడంతో చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అందుకే వారికోసమే ‘కార్తీక దీపం’ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్ గురించి ఆమె మాట్లాడారు.
గ్లిసరిన్ ఉపయోగించలేదు..
‘కార్తీక దీపం’ వల్ల తను అందుకున్న బెస్ట్ ప్రశంస ఏంటనే ప్రశ్నకు ప్రేమి స్పందిస్తూ.. ఆ పాత్రకు తన ఫేస్ సెట్ అయ్యిందని చాలామంది చెప్పారని అన్నారు ప్రేమి విశ్వనాథ్. అంతే కాకుండా ఇన్నేళ్లుగా ఇన్ని ఎపిసోడ్స్‌లో తాను ఒక్కసారి కూడా గ్లిసరిన్ ఉపయోగించలేదని చెప్పి షాకిచ్చారు. ఆ క్యారెక్టర్‌లో తను అంత లీనమయిపోయాను కాబట్టే అలా కన్నీళ్లు వచ్చేస్తున్నాయని అన్నారు. నిజ జీవితంలో మాత్రం తను చాలా పవర్‌ఫుల్ ఉమెన్ అని, ఏం జరిగినా చూసుకుంటామనే మనస్థత్వం తనది అని చెప్పుకొచ్చారు. రోడ్‌లో, షాపింగ్ మాల్‌లో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇప్పటికీ కొడతానని తెలిపారు. తెలియకుండా టచ్ చేశానని అంటారు కానీ వారంతా కావాలనే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గెలిచి చూపించాలి..
‘కార్తీక దీపం’కు దక్కిన పాపులారిటీపై ప్రేమి విశ్వనాథ్ స్పందించారు. ఐపీఎల్ సీజన్స్‌లో సీరియల్ టైమింగ్‌ను మార్చమని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్‌లు పెట్టేవారని చెప్తూ నవ్వుకున్నారు. అయితే సీరియల్‌లో తన పాత్రలాగానే నిజ జీవితంలో కష్టాలు పడే ఎంతోమంది ఆడవారికి తనదైన శైలిలో సలహా ఇచ్చారు. ‘‘ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎప్పుడూ సంతోషం మాత్రమే ఉండదు. ఎవరికైనా కష్టాలు వస్తాయి. వాటన్నింటి నుండి బయటపడడమే పాఠంలాంటిది. ప్రతీ స్టేజ్ ఒక పాఠమే. నేర్చుకుంటూ వెళ్లిపోవడమే. గెలిచి చూపించాలి’’ అంటూ దీపలాంటి కష్టాలు ఎదుర్కుంటున్న మహిళలకు ధైర్యం చెప్పారు ప్రేమి విశ్వనాథ్.
అత్త లేదు..
సీరియల్ నటిగానే ఆన్ స్క్రీన్ పాత్ర వరకు మాత్రమే ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. తను సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కూడా కాదు. ఇక మొదటిసారి ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి, వైవాహిక జీవితం గురించి మాట్లాడారు ప్రేమి విశ్వనాథ్. తనకు అత్త లేదని, మరణించిందని బయటపెట్టారు. అత్త లేదు కాబట్టే పోటీ ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. కానీ తనను చాలా మిస్ అవుతున్నానని వాపోయారు. ఇక చాలా నెలల తర్వాత ‘కార్తీక దీపం’ సీక్వెల్‌తో వంటక్కగా ప్రేమి విశ్వనాథ్‌ను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: టీవీల్లో సందడి చేయనున్న 'గుంటూరు కారం' - ఆ స్పెషల్ డేకి టెలికాస్ట్!