Kavitha Arrest News: లిక్కర్‌ స్కామ్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీల కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం ఆమె ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రానికి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. 


కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ వర్గాలు మండిపడుతున్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేపడుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా హరీష్‌, కేటీఆర్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే ఎందుకు ఈ దర్యాప్తు సంస్థలు యాక్టివ్ అవుతాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 






కేంద్రం తీరును ప్రశ్నిస్తున్న కేటీఆర్‌... గతంలో చంద్రబాబు చేసిన ఓ ట్వీట్‌ను రీట్విట్‌ చేశారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు.. "దర్యాప్తు సంస్థలు తీరుపై మండిపడ్డారు. పొలిటికల్ కక్ష సాధింపు చర్యల కోసమే కేంద్రం ఈడీ, సీబీఐలను వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్  చేశారు. బీజేపీయేతర పక్షాలపైకి వెళ్తున్న దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలపై ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 


" 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులను వారి కుటుంబ సభ్యులను బలిపశువులను చేయడానికి CBI & ED వంటి సంస్థలను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ ప్రతీకారానికి బిజెపి ఎంత దిగజారిపోతుందో చూపిస్తుంది. ఈ దాడుల సమయం ప్రశ్నార్థకం. ఇప్పుడే ఎందుకు? "అంటూ అప్పట్లో చంద్రబాబు ట్వీట్ చేశారు. 


దీన్ని ఇప్పుడు రీ ట్వీట్ చేసిన కేటీఆర్‌.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాన్ని చంద్రబాబు కంటే బాగా వర్ణించలేనంటూ చెప్పుకొచ్చారు. ఇదే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోడీ చేసిన ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్ చేశారు. వాటితోపాటు దర్యాప్తు సంస్థలపై రాహుల్ చేసిన కామెంట్స్‌ను కూడా కేటీఆర్‌ షేర్ చేశారు. 
 
అన్నింటి కంటే చంద్రబాబు ట్వీట్ రీ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. గతంలో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంలో కేటీఆర్ చేసిన ఓ ట్వీట్‌ టీడీపీ శ్రేణులను బాధించింది. వరుణ్‌గ్రోవర్‌ షో చూశాను చాలా ఎంజాయ్ చేశానంటూ పోస్ట్ చేశారు. అది చంద్రబాబు అరెస్టు హంగామా జరిగిన తర్వాత రోజే వేయడం సంచలనంగా మారింది. 



కేటీఆర్‌ అప్పట్లో చేసిన ట్వీట్‌ ను ఇప్పుడు టీడీపీ అభిమానులు షేర్ చేస్తూ కవిత అరెస్టుపై కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చంద్రబాబు చేసిన పాత ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్ చేయడం పరిస్థితిని మరింత హాట్‌గా మార్చేసింది. ఇప్పుడు రెండు పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ పెట్టుకుంటున్నారు.