BRS MLC Kavitha arrives in Delhi: ఢిల్లీ: మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అధికారులు ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Office) కు తరలించారు. నేటి రాత్రికి ఆమె ఢిల్లీ లోని ఈడీ కార్యాలయంలోనే ఉండనున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి 4 గంటలపాటు కవితను విచారించారు. సాయంత్రం 5:20  గంటలకు ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. నేటి రాత్రికి కవితను ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారని సమాచారం.


ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ 
ఈడీ ఆఫీసుకు తరలించేందుకు వేరే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఎయిర్ పోర్టు నుంచి ఈడీ ఆఫీసుకు కవితను తరలించారు. ఈ సమయంలో ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు డాక్టర్ల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మధ్యాహ్నం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అధికారులు తమ కస్టడీ కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.


ఇలాంటి కుట్రలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం 
ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడంపై కవిత ఘాటుగా స్పందించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని కవిత అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధైర్యపడొద్దని కుమారుడికి ధైర్యం చెప్పి ఆమె ఇంటి నుంచి ఈడీ అధికారులతో కారులో బయలుదేరారు. అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం ప్రకారం ఎదుర్కొంటామని కవిత అన్నారు.