Lithium Reserves in J&K:
లిథియం నిల్వలు..
బ్యాటరీల తయారీలో కీలకమైన "లిథియం" కోసం భారత్ చైనా, ఆస్ట్రేలియా దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటిని దిగుమతి చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఈ వ్యయం తగ్గించుకునేందుకు భారత్‌లోనే లిథియం నిల్వలు ఉన్నాయా లేదా అని సర్వే చేసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI). జమ్ముకశ్మీర్‌లో భారీ రిజర్వ్‌లు ఉన్నట్టు గుర్తించింది. రీసీ జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 650 కిలోమీటర్ల దూరంలో ఈ నిల్వలను కనుగొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 51 రకాల మినరల్ బ్లాక్‌లను గుర్తించగా...అందులో లిథియం బ్లాక్ ఒకటి. కొన్ని చోట్ల గోల్డ్ బ్లాక్‌లనూ కనుగొన్న GSI..వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ 51 మినరల్ బ్లాక్‌లలో 5 బంగారానివే. మిగతావి జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటకలో ఉన్నాయి. వీటిలో పొటాష్, మాలిబ్డెనమ్ ఖనిజాలను కనుగొన్నారు. 2018-19 మధ్య కాలంలో చేసిన సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ 7,897 టన్నుల బొగ్గు నిల్వల్ని కనుగొంది. దాదాపు 115 ప్రాజెక్టుల ద్వారా GSI నిత్యం ఆయా ఖనిజాల నిల్వల్ని వెలికి తీస్తూ ఉంది.
ఈవీలకు ఇవే ముఖ్యం..
విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది కేంద్రం. అయితే...ఈ వెహికిల్స్‌కి అవసరమైన బ్యాటరీలు తయారు చేయాలంటే లిథియం కచ్చితంగా అవసరం. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా లిథియంను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు చైనా, ఆస్ట్రేలియా.
భారత్ కూడా వీటిపైనే ఆధార పడుతోంది. ప్రధాన నగరాలన్నింటిలోనూ విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలన్న లక్ష్యానికి లిథియం కొరత అడ్డంకింగా మారింది. అందుకే...GSI చాలా రోజుల పాటు సర్వే చేపట్టి జమ్ముకశ్మీర్‌లో ఈ నిల్వలను కనుగొంది. ఫలితంగా...ఇకపై భారత్ బ్యాటరీల తయారీ కోసం వేరే దేశాలపై ఆధారపడే పరిస్థితి మారుతుంది.
చాలా మంది ఎలక్ట్రిక్ వాహనదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఛార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్న వారికి చాలా ఇబ్బందిగా, అంతకు మించి చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికన్ ప్రభుత్వ పరిశోధకులు. కేవలం 10 నిమిషాల్లో 90 శాతం ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలను ఛార్జ్ చేసే మార్గాన్ని కనుగొన్నారు. ఇదే వాస్తవరూపం దాల్చితే స్మార్ట్ ఫోన్ కన్నా వేగంగా కార్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ కొత్త టెక్నాలజీని మరో 5 సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీని మూలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని వెల్లడించారు. అంతేకాదు.. ఇదే కనుక అమల్లోకి వస్తే కాలుష్య కారక వాహనాలకు చెక్ పెట్టి.. క్లీన్ వెహికల్స్ వాడేందుకు ప్రజలు మొగ్గు చూపుతారని వెల్లడించారు.
Also Read: Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్ ఇస్తాం, చిన్న వ్యాపారులూ తీసుకోవచ్చు - కేంద్ర మంత్రి