Digital Credit System: 

డిజిటల్ పేమెంట్ ఫెస్టివల్..

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్‌ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు వెల్లడించింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయాన్ని అధికారికంగా చెప్పారు. "Digital Payment Festival" కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ క్రెడిట్ సిస్టమ్‌ ద్వారా బడా బ్యాంకులను చిన్న వ్యాపారులకూ లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించనున్నట్టు చెప్పారు. యూపీఐ సర్వీస్‌లా త్వరలోనే ఈ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ "డిజిటల్ ఇండియా" విజన్‌లో భాగంగా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టనుంది కేంద్రం. 

"ఈ ఏడాదిలో డిజిటల్ లోన్ సర్వీస్‌ను ప్రారంభిస్తాం. మరో 10-12 ఏళ్లలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరింత బలోపేతమవుతుంది" 

 అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి 

మరింత విస్తృతం..

ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో ఫీచర్‌ను లాంచ్ చేశారు. UPIకి సంబంధించి వాయిస్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ ప్రోటోటైప్‌ను ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను వీలైనంత వరకూ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతే కాదు. స్థానిక భాషల్లోనే యూపీఐ చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. తద్వారా మారుమూల ప్రజలు కూడా సులువుగా తమ భాషలోనే అప్లికేషన్‌ను వినియోగించుకోవచ్చని, చెల్లింపులూ సులభంగా చేసే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. NPCI సేవల్ని విస్తృతం చేయడంతో పాటు మరి కొన్ని విధానాలనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇదే ఈవెంట్‌కు హాజరైన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ అల్కేశ్ కుమార్ శర్మ కూడా పాల్గొన్నారు. త్వరలోనే UPIని గ్లోబల్ పేమెంట్‌ ప్రొడక్ట్‌గా మార్చుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే NPCI నేపాల్, సింగపూర్, భూటాన్ లాంటి దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూకే, యూఎస్‌ఏ దేశాల్లోని NRIలు కూడా ఈ యూపీఐ ద్వారానే చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం. త్వరలోనే G-20 సమావేశానికి నేతృత్వం వహించనున్న భారత్...డిజిటల్ ఇండియా నినాదాన్ని బలంగా వినిపించనుంది. ఆయా దేశాలతో చర్చించి డిజిటల్ సేవల్ని మరింత విస్తృతం చేయనుంది. చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఇన్‌స్టంట్‌గా లోన్ ఇచ్చేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది. 

Also Read: ISRO Launch: పడిన చోటే ఎగిరిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2- విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఇస్రో