74వ బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఈనెల 11న జరగనుంది. పాసింగ్ ఔట్ పరేడ్‌కు చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 195 మంది మంది ఐపీఎస్‌లు 15 వారాల పాటు ముస్సోరిలో, 46 వారాల పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 37 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నారు. ఈ బ్యాచ్ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ట్రైనీ ఆఫీసర్లను కేటాయించారు. వీరంతా 30 వారాల పాటు డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం మరో 10 వారాల పాటు అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది.
సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో లైవ్ కేసులను చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ సారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్ట్‌లు కలిపి 17 అంశాలపై వీరంతా శిక్షణ పొందారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ, ఎన్డీపీఎస్ కేసులు, సైబర్ నేరాలు, కోర్టు కేసుల ట్రయిల్స్, టెక్నికల్, ఫైనాన్షియల్ క్రైమ్స్ కు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు.
హైదరాబాద్ లో నేటి నుంచి ఫార్ములా-ఈ కార్స్ రేసింగ్
స్ట్రీట్ సర్క్యూట్‌పై కార్లు రయ్‌మని పరుగులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తికాగా, నేటి నుంచి అభిమానుల సందడి మొదలుకానుంది. ప్రధాన రేసుకు సన్నాహకంగా జరిగే ఈ రేసు ద్వారా రేసర్లు ట్రాక్‌పై అవగాహనకు రానున్నారు. రెడీ టు గో అనడమే ఆలస్యం కార్లను పరుగులు పెట్టించేందుకు రేసర్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రేసును ఆస్వాదించేందుకు సిద్ధమైపోండి.
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు హైదరాబాద్ ముస్తాబైంది. భారత్‌లో తొలిసారి జరుగుతున్న రేసుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న రేసు కోసం హుసేన్‌సాగర్ తీర ప్రాంతం కొత్త హంగులతో సిద్ధం అయింది. తొమ్మిదో సీజన్‌లో భాగంగా నాలుగో రేసు హైదరాబాద్ వేదిక అవుతున్నది. మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు బరిలోకి దిగుతున్నారు.
హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పేరిట జరగనున్న రేసుకు సంబంధించిన ఫార్ములా-ఈ సీఈవో జామీ రిగిల్ మాట్లాడుతూ ‘ఈ సీజన్ ద్వారా జెన్-3కార్లను రేసింగ్‌లోకి తీసుకొచ్చాం. సరికొత్త సాంకేతికతను జోడిస్తూ మరింత తేలికగా, వేగంగా రూపొందించిన కార్లు హైదరాబాద్ సర్క్యూట్‌లో రయ్‌మంటూ దూసుకెళుతాయి. గంటకు 320 కి.మీ వేగంతో 350 కేడబ్ల్యూ సామర్థ్యం కల్గిన జెన్ 3 కార్లు టెక్నాలజీ పరంగా అత్యుత్తమంగా నిలుస్తాయి. ఫైటర్ జెట్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందుతూ కార్లను రూపొందించడం జరిగింది. బ్రేకింగ్ ద్వారా 40 శాతం శక్తిని తిరిగి పొందడం వీటి ప్రత్యేకత.
నేటి షెడ్యూల్
మధ్యాహ్నం 12.30-12.45 వరకు ప్రెస్‌మీట్ (టీమ్ ప్రతినిధులు)
మధ్యాహ్నం 12.45-1.00 వరకు ప్రెస్ మీట్(డ్రైవర్స్)
మధ్యాహ్నం 1.30 -2.00 వరకు మీడియా సేఫ్టీ బ్రీఫింగ్
మధ్యాహ్నం 2.30-2.45 వరకు షేక్ డౌన్
మధ్యాహ్నం 4.30 నుంచి 5.00 వరకు ఫ్రీ ప్రాక్టీస్ 1
ఖమ్మం జిల్లాకు చేరుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోడో యాత్ర
ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైన పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి హథ్ సే హాథ్ జోడో యాత్ర రాత్రి ఖమ్మం జిల్లాకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లాలో యాత్ర ముగించిన రేవంత్ రెడ్డి కామేపల్లి మండలం లచ్చాతండా చేరుకోగా.. ఆయనకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. లచ్చగూడెంలోనే బస చేశారు. నేడు కామేపల్లి మండలంలోని లచ్చాతండా నుంచి యాత్రను ప్రారంభించి బర్లగూడెం, పొన్నెకల్, బండిపాడు క్రాస్‌రోడ్, గోవింద్రాల, పాతలింగాల మీదుగా కొత్తలింగాల క్రాస్‌రోడ్‌కు చేరుకుని.. బహిరంగసభ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చేరుకుని.. 11న ఉదయం ఇల్లెందులో నాయకులు, కార్యకర్తలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. రేవంత రాకతో ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మహాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చిన సమయంలో లచ్చగూడెం గ్రామంలో బస చేశారు.
టీ హబ్ సహకారంతో ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023'ని నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిథులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023'ని నిర్వహిస్తోంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కి పైగా విదేశీ విశ్వవిద్యాలయాలకి చెందిన 60 మందికి పైగా ప్రతినిధులు ఒక రోజు పాటు జరిగే ఈ సదస్సులో పాల్గొంటారు. స్టూడెంట్ లోన్లని అందించే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రిపరేషన్ టెస్ట్ ఏజెన్సీలైన ఈటీఎస్, పీటీఈ, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారెక్స్ రెమిటర్ లు వంటి వివిధ భాగస్వాములు హాజరై విద్యార్థికి ఒక సంపూర్ణమైన అనుభవాన్ని అందించనున్నారు.
యూఎస్ కాన్సులేట్‌కి చెందిన కాన్సులర్ అధికారులు యూఎస్ఏ స్టడీ, యూఎస్ వీసా ప్రాసెస్ గురించి సెమినార్ నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకి విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్య అతిథులుగా టీఎస్‌సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, టీపీఎస్‌సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.పట్టాభి హాజరుకానున్నారు.