అక్టోబర్‌- డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి సీఎం జగన్ ప్రారంభిస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ఆర్ధిక సాయాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తోంది.


నిబంధనలు ఇవే....


పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలు నివారించడం, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్‌ రేట్‌ తగ్గించేందుకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా లబ్ధిదారులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్ళు కచ్చితంగా నిండాలని నిర్ధేశించింది. గత ప్రభుత్వంలో అరకొరగా కొన్ని వర్గాలకే ఆర్థిక సాయం, అదీ సకాలంలో అందరికీ అందని వైనం, సాయం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన దైన్యం ఏర్పడిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేసి 2018 అక్టోబర్‌ నుంచి ఈ పథకాన్ని ఎత్తివేసిన దుస్ధితి ఉందని అంటున్నారు. 2018 – 19 సంవత్సరంలో ఏకంగా 17,709 మంది లబ్ధిదారులకు రూ. 68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టారని విమర్శిస్తున్నారు. తమ ప్రభుత్వంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా, కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగే దుస్ధితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధ ద్వారా అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంతృప్తస్థాయిలో లబ్ధి అందుతుందని అన్నారు. పేదల ఇంట్లో పెళ్ళి కూడా ఆనందాల అనుభూతులను మిగిల్చేలా సాయాన్ని రెట్టింపు చేశామని చెబుతున్నారు. 


ఇవీ లెక్కలు...


ఎస్సీలకు గత ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఆర్థిక సాయం రూ. 40,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000...
ఎస్సీలకు (కులాంతర వివాహం) గత ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఆర్థిక సాయం రూ. 75,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
ఎస్టీలకు గత ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఆర్థిక సాయం రూ. 50,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
ఎస్టీలకు (కులాంతర వివాహం) గత ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సాయం రూ. 75,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
బీసీలకు గత ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సాయం రూ. 35,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
బీసీ (కులాంతర వివాహం) గత ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఆర్థిక సాయం రూ. 50,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000


మైనార్టీలు గత ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సాయం రూ. 50,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000


విభిన్న ప్రతిభావంతులు గత ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సాయం రూ. 1,00,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000


భవన, ఇతర నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వం అందిస్తామన్న ఆర్థిక సాయం రూ. 20,000
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000


మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఎంపిక


వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి, సంబంధిత అధికారులు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేసి వివరాలను ధృవీకరించుకుని, ప్రతి ఏటా ఫిబ్రవరి, మే, ఆగష్టు, నవంబర్‌లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.